కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డు  

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో భారత్‌ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. తొలిరోజు అత్యధిక సంఖ్యలో కరోనా టీకాలను పంపిణీ చేసిన దేశంగా భారత్‌ రికార్డుకెక్కింది. టీకా పంపిణీ ప్రారంభమైన తొలిరోజే దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒకే రోజు వేసిన టీకాల సంఖ్య కంటే ఎక్కువగా భారత్‌ టీకాలను వేసిందని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహన్‌ అగ్నాని ప్రకటించారు. రెండో రోజు కూడా మొత్తం 17,072 మందికి వ్యాక్సిన్‌ కొనసాగిందని కేంద్రం తెలిపింది.

తొలి రోజు రెండు లక్షల 7 వేల మంది కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోగా, రెండో రోజు 17 వేల మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఇప్పటి వరకు 2,24,301 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా తీసుకున్న వారిలో 447 మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అవి కేవలం సాధారణమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటివి మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. వీరిలో ముగ్గురిని మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిచాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది. 
 
కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీపై అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించామని, తొలిరోజు ఎదురైన సమస్యలను గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్యంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఆదివారంనాడు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 553 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదనపు కార్యదర్శి మనోహర్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం టీకా పంపిణీ కొనసాగిందని తెలిపారు.
 
ఇలా ఉండగా, కొవిడ్ టీకాలకు వ్యతిరేకంగా పుకార్లతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ నగరంలో జరిగింది. బరేలీ నగరంలోని నాగరిక రాజేంద్ర నగర్ ప్రాంతంలో కరోనా వ్యాక్సిన్లు తీసుకోవద్దంటూ కొందరు కరపత్రాలు పంపిణీ చేసినట్లు నగర ఎస్పీ రవీంద్రసింగ్ చెప్పారు. పోలీసులు కొవిడ్ టీకా వ్యతిరేక ప్రచార కరపత్రాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
 
కొవిడ్ టీకాల విషయంలో మతతత్వ అభిరుచులను రేకేత్తించేలా యత్నించారని పోలీసులు చెప్పారు. కొవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలను తప్పుదోవ పట్టించేలా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కరపత్రాల పంపిణీ అనంతంర నిందితులను పట్టుకునేందుకు ప్రత్యే పోలీసులను మోహరించారు.