తాండవ్‌ వెబ్‌ సిరీస్ పై హిందువుల ఆగ్రహం 

అమెజాన్‌ ప్రైమ్‌లో జనవరి 15న రిలీజైన తాండవ్‌ వెబ్‌ సిరీస్‌ హిందువుల మనోభావాలను గాయపరచి ఉన్నదంటూ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్‌ హీరో సైఫ్ అలీఖాన్   ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను నిషేధించాలని  బీజేపీ ఎంపీ మనోజ్‌ కోటక్‌ డిమాండ్‌ చేస్తున్నారు. 

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న తాండవ్‌ వెబ్‌సిరీస్‌ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ సమాచార- ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు ఆయన లేఖ రాశారు. ఓటీటీలకున్న విచ్చలవిడి స్వేచ్ఛ వల్ల హిందువుల సెంటిమెంట్ల మీద పదేపదే దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీటీ నుంచే వచ్చే సినిమాల మీద కూడా నియంత్రణ ఉండాలని స్పష్టం చేశారు. 

 హిందువుల మనోభావాలను కించపరిచినందుకుగానూ తాండవ్‌ చిత్రయూనిట్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎంపీ డిమాండ్‌ చేశారు. అటు సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లు తాండవ్‌ సిరీస్‌ మీద శివాలెత్తుతున్నారు. తమ దేవుళ్లను ఎగతాళి చేశారని మండిపడుతున్నారు. ముఖ్యంగా నటుడు మహ్మద్‌ జీషా అయ్యుబ్‌ స్టేజీ మీద శివుడిగా కనిపించే సీన్‌ను వెంటనే తొలగించాలని పట్టుపడుతున్నారు.

అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్‌ డ్రామా చిత్రాన్ని అలీ అబ్బాస్‌తో కలిసి హిమాన్షు కిశన్‌ మెహ్రా నిర్మించారు. డింపుల్‌ కపాడియా, సునీల్‌ గ్రోవర్‌, తిగ్మన్షు ధులియా, గౌహర్‌ ఖాన్‌ తదితరులు నటించారు.