చట్టాలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలూ రైతులకు మేలు చేసేవేనని  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ ప్రభుత్వ అతిపెద్ద ప్రాధాన్యత అని చెబుతూ  ఆ చట్టాలతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని భరోసా ఇచ్చారు. 

కర్నాటకలోని బాగల్‌కోట్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొంటూ ‘‘రైతుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నూతన చట్టాలు మూడూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయి. వీటితో దేశంలో ఎక్కడైనా రైతు తన పంటను అమ్ముకోవచ్చు. వీటికి అనుగుణంగా యడియూరప్ప ప్రభుత్వం కూడా చట్టాన్ని తెచ్చింది. అందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నా.’’ అని పేర్కొన్నారు. 

తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు క్షేమం కోసం వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ను పెంచుతూనే ఉన్నామని, వివిధ రకాలైన పంటలకు కనీస మద్దతు ధరను కూడా పెంచినట్లు అమిత్‌షా గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను పార్టీని అమిత్‌ షా ప్రశ్నిస్తూ రైతులకు రూ.6 వేల ఆర్థికసాయం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 

ప్రధానమంత్రి పసల్‌ బీమా యోజన ఇన్సూరెన్స్‌ స్కీంను ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. పార్టీ ఉద్దేశాలు సరిగ్గా లేనందునే వారు ఈ పనులకు ఉపక్రమించలేదని ధ్వజమెత్తారు. రైతులకు అంకితమైన ప్రభుత్వం నరేంద్రమోదీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.

కాగా,   దేశంలోని అత్యధిక రైతులు తాము తెచ్చిన నూతన చట్టాలకు అనుగుణంగానే ఉన్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ‘‘రైతులు, నిపుణులు చాలా మంది వ్యవసాయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నారు. సుప్రీం ఉత్తర్వుల తర్వాత చట్టాలను అమలు చేయలేం. జనవరి 19 న నిబంధనల వారిగా రైతులు చర్చిస్తారని ఆశిస్తున్నాం. చట్టాల రద్దు మినమా ఏ చర్చకైనా సిద్ధమే’’ అని తోమర్ ప్రకటించారు. 

మండీలు, వ్యాపారాలు తదితర విషయాలకు సంబంధించి, రైతుల సంఘాల్లో నెలకొన్న భయాలను పరిష్కరించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. ఈ మేరకు రైతు సంఘాలకు ప్రతిపాదనలు కూడా పంపామని ఆయన వెల్లడించారు. పంట వ్యర్థాలను తగలబెట్టే విషయం, విద్యుత్తు తదితర అంశాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.  అయితే రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దు అన్న ఏకైక అజెండాతో ముందుకు వెళ్తున్నారని తోమర్ విచారం వ్యక్తం చేశారు.