తెలంగాణలో2023లో  రాబోయే ప్రభుత్వం మనదే! 

మనం మరింత సమర్ధవంతంగా ప్రజా సమస్యలపై పోరాడితే తెలంగాణలో 2023లో రాబోయే ప్రభుత్వం మనదే అని బీజేపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ దుబ్బాకలో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీకి గెలుపు తర్వాత తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్న్యాయం అనే నమ్మకం ప్రజలలో వచ్చినదని చెప్పారు. 
 
రాబోయే కాలం మనకు మరింత పరీక్షా సమయం అని చెబుతూ కొద్దీ నెలల్లో జరుగబోయే వరంగల్, ఖమ్మం, సిద్దిపేట వంటి మునిసిపల్ ఎన్నికలలో; రెండు పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలతో పాటు నోముల నరసింహయ్య అకాలమరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సహితం బీజేపీ గెలుపొందవలసిన అవసరం ఉన్నదని దిశానిర్ధేశం చేశారు. 
బిజెపి పెరుగుదలను అడ్డుకొనేందుకు కేసీఆర్ నాయకత్వంలోని టి ఆర్ ఎస్ పార్టీ ఎన్ని దుష్టపన్నాగాలనైనా చేస్తుందని సంజయ్ హెచ్చరించారు. మొత్తం అధికార యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో ఉంచుకొని మన కార్యకర్తలను వేధిస్తారని, పోలీసుల సహాయంతో మన కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తారని తెలిపారు. వీటన్నింటిని ఎదుర్కొని 2023లో విజయం కోసం కార్యకర్తలు అందరు సమిష్టిగా కృషి చేయాలని  పిలుపిచ్చారు. 
 
కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత బలంగా ప్రజలలోకి తీసుకు వెళ్లాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు మరింతగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. 
 
కరోనా సందర్భంగా ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజి ద్వారా భారత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలని సంజయ్ తెలిపారు. కరోనా మహమ్మారి అనంతరం వచ్చే దశాబ్దాలలో భారత్ ప్రపంచ దేశాలను ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదగడం కోసం నరేంద్ర మోదీ నాయకత్వంలో చేస్తున్న కృషిని కూడా వివరించాలని చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నదని, కేసీఆర్ పాలనలో మొత్తం అభివృద్ధి కుంటుబడుతున్నదని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని తుంగలో తొక్కిన కేసీఆర్ 2018లో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు పరచడం లేదని ధ్వజమెత్తారు. 
 
ఆర్ధిక సమస్యలతో పాటు, అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉంటె కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ లేదా ఫార్మ్ హౌజ్ దాటి బైటకు రావడం లేదని విమర్శించారు. ప్రజలను కలవని మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం తెలంగాణ చేసుకున్న దురదృష్టమని విచారం వ్యక్తం చేశారు. కరొనను నియంత్రించడంలో, కరోనా బాధితులకు సరైన చికిత్స అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనదని సంజయ్ మండిపడ్డారు. కరోనా అరికట్టడంలో కేసీఆర్ తీసుకున్న అనేక అశాస్త్రీయ విధానాలకు వ్యతిరేకంగా బిజెపి అనేక ఉద్యమాలు చేపట్టినదని గుర్తు చేశారు. 
 
చివరకు ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ వచ్చే వరకు ఇక్కడ అనేక వైద్య పరిశోధన సంస్థలు, వ్యాక్సిన్ లు తయారు చేసే సంస్థలు ఉన్నప్పటికీ కేసీఆర్ వారితో ఒక సమీక్ష కూడా చేయలేదని సంజయ్ విమర్శించారు. తెలంగాణాలో గత ఏడాది కాలంగా శాంతిభద్రతలు ఘోరంగా క్షీణిస్తూ వస్తున్నాయని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాక్రాంతమైన లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవలసిన ప్రభుత్వం కబ్జాదారులకు అండగా నిలుస్తున్నదని మండిపడ్డారు.
 
 హైదరాబాద్ లో భూమాఫియా దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నా, వారు హత్యలకు దిగుతున్నా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంజయ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్ని మాఫియా గ్యాంగ్ లకు కేర్ అఫ్ అడ్రస్ గా కేసీఆర్ పార్టీ మారినదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో అమలు పరచవలసిన వేతన సవరణను ఇప్పటి వరకు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను,, ఫింఛనుదారులను వేధిస్తున్నదని సంజయ్ విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని ధ్వజమెత్తారు.