గుజరాత్‌లోని సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం ఉన్న కెవాడియాను దేశవ్యాప్తంగా పలు స్టేషన్లకు అనుసంధానం కావిస్తూ ప‌్రధాని నరేంద్రమోదీ ఆదివారం కొత్తగా 8 రైళ్లను ప్రారంభించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కాగా, కొత్తగా ప్రారంభమైన ఈ ఎనిమిది రైళ్లు గుజరాత్‌లోని కెవాడియా పట్టణం నుంచి దేశంలోని ఎనిమిది ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి.
గుజరాత్‌లోని కెవాడియా పట్టణం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీకి హోమ్‌టౌన్‌గా ఉన్నది. కొత్తగా ప్రారంభించిన రైళ్లు నర్మదా నది ఒడ్డున ఉన్న పురాతన, పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతాయి. తద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగి కొత్త ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగై ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.
ఎనిమిది రైళ్లు కెవాడియాకు వారణాసి, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్, దాదర్, అహ్మదాబాద్ నుంచి నడువనున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ 2018 అక్టోబర్‌లో పటేల్ భారీ విగ్రహమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతమైన కెవాడియాలో పర్యాటకానికి ఊతమివ్వడానికి, స్టాట్యూ అఫ్ లిబర్టీకి ప్రపంచ నలుమూలల నుంచి కనెక్టివిటీ సదుపాయం కల్పించడానికి కొత్తగా రైళ్లను ప్రారంభించినట్లు ప్రధాని పేర్కొన్నారు.
సరిగ్గా ఎంజీ రామచంద్రన్ జయంతి రోజునే చెన్నై నుంచి రైళ్ల అనుసంధానం చేయడం హర్షనీయమని, అది యాదృచ్ఛికమని అన్నారు. పేద ప్రజల క్షేమం కోసం తన జీవితాన్ని ధారబోసిన మహానేత అని ప్రధాని మోదీ కొనియాడారు. రైళ్లను అనుసంధానించడం ద్వారా దేశంలోని ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆ విగ్రహం దగ్గరికి చేరుకునే సౌలభ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
2018 డిసెంబర్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నర్మదానది ఒడ్డున ఉన్న 182 ఎత్తయిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కెవాడియాను సందర్శించి.. రైల్వే స్టేషన్‌కు పునాదిరాయి వేశారు. ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సందర్శించేందుకు వీలుగా రైల్వే కనెక్టివిటీని పెంచారు.
కెవాడియా ప్రధాన మార్గంతో అనుసంధానించేందుకు 18 కిలోమీటర్ల దభోయ్-చందోద్ ఇరుకైన గేజ్ మార్గాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. 32 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ లైన్ వేసి చందోద్‌ను కెవాడియాతోను అనుసంధానించారు. అలాగే దభోయ్, చందోద్, కెవాడియా మధ్య కొత్త బ్రాడ్‌గేజ్ లైన్‌తోపాటు స్టేషన్ల కొత్త భవనాలను ప్రధాని ప్రారంభించారు.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, హర్యానాలో బిజెపి