రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులలో కుట్రకోణం ఏమీ లేదని, రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్లు ఎక్కడా తేలలేదని చెప్పిన రాష్ట్ర డిజిపి డీజీపీ గౌతమ్ సవాంగ్ రెండు రోజులలో మాటమార్చి టిడిపి, బిజెపి వారి ప్రమేయం ఉన్నట్లు ఆరోపించడంపై ఆ రెండు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర లేదు. కానీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనుక కుట్ర ఉండొచ్చు’ అని బుధవారం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో ఇప్పటి వరకూ ఛేదించిన 29 కేసుల్లో కుట్రకోణం కనిపించ లేదని తేల్చి చెప్పారు.
అయితే, రెండు రోజుల తర్వాత ‘‘రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల పాత్ర ఉంది. 9 కేసుల్లో వారి పాత్రపై ఆధారాలు సేకరించాం. అందులో 15 మందిని అరెస్టు చేశాం. వీరిలో 13 మంది టిడిపికి, ఇద్దరు బిజెపికి చెందిన వారు. మరో ఆరుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు’’ అంటూ మాట మార్చారు.
ఈ దాడుల వెనుక సూత్రధారుడిగా భావిస్తున్న కాకినాడ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత డిజిపి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అసలు కుట్ర నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ ప్రకటన చేశారా అనే అనుమానం కలుగుతున్నది.
డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వ్రాసిన లేఖలో బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తామంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. హిందూ దేవాలయాలపై దాడుల్లో బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉందని డీజీపీ చెప్పడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి గందరగోళ ప్రకటనలు చేయొద్దని హితవు చెప్పారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసులు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసు బాస్‌గా ఏ పార్టీకి మద్దతు ఇవ్వొద్దని సోమువీర్రాజు చెప్పారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ, బీజేపీ ఉందని ఎలా చెబుతారని డిజిపిని ఎమ్యెల్సీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ ప్రశ్నించారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ వైసీపీ నేతగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారన్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై పోలీసుల దాడులు పిరికిపంద చర్య అంటూ బీజేపీ శ్రేణులకు డీజీపీ క్షమాపణ చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు.
17మంది టీడీపీ, నలుగురు బీజేపీ వాళ్లను అరెస్ట్ చేసినట్లు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఎవరైతే దాడులు చేశారో వాళ్లను వదిలేసి, వాటిని నిలదీసిన వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు. 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారు. ఈ దాడులకు రాజకీయాలకు సంబంధం లేదు, ఉన్మాదుల పని, పిచ్చోళ్ల పనిగా భోగిరోజున డీజీపీనే చెప్పారు. ఇప్పుడు డీజీపీ మళ్లీ కనుమ రోజున మాటమార్చి దీనిని ప్రతిపక్షాలకు అంటగడుతున్నారు’ అంటూ చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రులపై చర్యలు లేవు. విగ్రహాల తలకొట్టడం, వనదేవతలను కాలితో తన్నడం తమ మత ప్రచారంలో భాగమని ప్రచారకులే చెబుతుంటే ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. క్రిస్టియన్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బలవంతపు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారు. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి టిడిపి ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. సంక్రాంతి సంబరాల ముసుగులో కోడిపందాలు, అశ్లీల నృత్యాలు చేస్తున్న వారిపై డీజీపీ ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయలేని, చేతకాని స్థితిలో పోలీసులు ఉన్నారని విమర్శించారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం