ముద్రగడతో సోము వీర్రాజు భేటీ 

కాపు ఉద్యమ  నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో   బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం భేటీ అయ్యారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలసిన్నట్లు వీర్రాజు చెబుతున్నప్పటికీ ఆయనను బీజేపీలో ఆహ్వానించడం కోసమే అని తెలుస్తున్నది. 
అనేక దఫాలుగా మంత్రిగా  బాధ్యతలు నిర్వ‌హించైనా ముద్రగడతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఓ కీల‌క పాత్ర పోషించాల్సిన‌ ఆవశ్యకత ఉంద‌ని తాను ఆయనకు చెప్పిన్నట్లు వీర్రాజు ఓ ట్వీట్ లో తెలిపారు. ఈ విష‌యంపైనే  తాను చ‌ర్చించాన‌ని స్పష్టం చేశారు.

‘కుటుంబ రాజకీయాల నుండి విముక్తి కల్పిస్తూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ, బలీయమైన శక్తిగా భాజపా – జనసేన కూటమి పాత్ర పోషించనున్న నేపథ్యంలో మా మధ్య జరిగిన స్నేహపూర్వక భేటీ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. మా పట్ల శ్రీ ముద్రగడ పద్మనాభం గారు చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని తన ట్వీట్ లో వీర్రాజు తెలిపారు. 

 
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కూడా వీర్రాజు ముద్రగడను కలవడం తెలిసిందే. టిడిపి, వైసీపీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్న్యామ ఏర్పాటుకు భవసామీప్యం కలిగిన వారంతా కలసివచ్చేటట్లు రాష్ట్ర బిజెపి నాయకులు  కృషి చేస్తున్నారు.
 
గతంలో వాజపేయి ప్రభుత్వం ఉన్న సమయంలో కాకినాడ నుండి ముద్రగడ పద్మనాభం బిజెపి అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు.