డీపీఆర్‌లు వెంటనే పంపండి….  సీఎంలకు కేంద్రం లేఖ 

రెండు తెలుగు రాష్ట్రాలల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాల్సిందిగా  మరోసారి కోరుతూ  కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లేఖ రాశారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు వ్రాసిన లేఖలలో డీపీఆర్‌లు, ఇతర వివరాలు ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

పొరుగు రాష్ట్రం అక్రమంగా సాగునీటి ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్నట్లు పరస్పరం ఈ రెండు రాష్ట్రాలు ఆరోపణలు చేసుకొంటుండగా,  వారి ఆరోపణలలో నిజాలు నిగ్గు తేల్చడం కోసం కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా ఆయా ప్రాజెక్ట్ లకు సంబంధించిన డిపిఆర్ లను పంపకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం లేదు. 

డీపీఆర్‌లు వెంటనే ఇచ్చేలా చూడాలని సీఎంలకు వేర్వేరుగా లేఖలు రాశారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణ, ఏపీ పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అక్టోబర్‌ 6 నాటి అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం అమలు చేయాలని పేర్కొంది. అక్టోబర్‌ 6న ఇద్దరు సీఎంలు, మంత్రులు, అధికారులతో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ జరిగింది. 

ఈ భేటీలో కేంద్ర మంత్రి స్వయంగా డిపిఆర్ ల గురించి ప్రస్తావించగా వారం రోజులలో పంపుతామని ఇద్దరు ముఖ్యమంత్రలు చెప్పినా ఇప్పటి వరకు పంపలేదు. ఈ విషయమై కేంద్ర జలశక్తి కార్యదర్శి వరసైన లేఖలను కూడా ఖాతరు చేయలేదు. 

తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్ర మంత్రి మరోసారి స్పష్టం చేశారు. కృష్ణాపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టుల డీపీఆర్‌లు తెలంగాణ ఇవ్వాలని పేర్కొన్నారు. అదేవిధంగా  ఏపీ కృష్ణా నదిపై 15, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఇవ్వాలని కేంద్రమంత్రి లేఖలో కోరారు.

రాయలసీమ ఎత్తిపోతలపై నిబంధనల మేరకు డీపీఆర్‌ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా చెప్పారు. పట్టిసీమ 3వ దశ డీపీఆర్‌ ఇవ్వాలని గోదావరి బోర్డు కోరిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పురుషోత్తపట్నం మినహా ఏపీ దేనికీ పూర్తి డీపీఆర్‌ ఇవ్వలేదని చెప్పారు. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలని షెకావత్‌ హితవు చెప్పారు.