విదేశీ అతిథి లేకుండానే రిపబ్లిక్ డే   

ఈ ఏడాది రిప‌బ్లిక్ డే వేడుక‌లు సాధార‌ణ ప్ర‌క్రియ‌గానే సాగ‌నున్నాయి. విదేశీ అధినేత ముఖ్య అతిథిగా హాజ‌రు కాకుండానే ఈ ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకలు జ‌రుగ‌నున్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావం వ‌ల్ల విదేశీ అధినేత‌లు ఎవ‌రూ రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు ముందుకు రావ‌డం లేద‌ని విదేశాంగ‌శాఖ అధికార ప్ర‌తినిధి అనురాగ్ శ్రీవాత్స‌వ చెప్పారు.

ప్ర‌తియేటా విదేశీ అధినేత‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. ఈ ఏడాది ముఖ్య అతిథిగా బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ను భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఆహ్వానించారు. త‌ద‌నుగుణంగా బోరిస్ జాన్స‌న్ కూడా అందుకు స‌మ్మ‌తించారు. క‌రోనా వైర‌స్ న్యూ స్ట్రెయిన్ బ్రిట‌న్‌ను క‌కావిక‌లం చేయ‌డంతో చివ‌రిక్ష‌ణంలో భార‌త రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు రాలేన‌ని ప్ర‌ధాని మోదీకి బోరిస్ జాన్స‌న్ స‌మాచారం ఇచ్చారు. త‌న‌కు దేశంలో క‌రోనా స్ట్రెయిన్ నియంత్ర‌ణే ప్ర‌ధానం అని స్ప‌ష్టం చేశారు.

రిప‌బ్లిక్ డే ముఖ్య అతిథిగా రిప‌బ్లిక్ ఆఫ్ సురినామ్ దేశ అధ్య‌క్షుడు చంద్రికాప‌ర్సాద్ సంటోఖి రానున్న‌ట్లు  ఇటీవ‌లే ప్ర‌ధానమంత్రి కార్యాల‌యం వెల్ల‌డించింది. ఈయ‌న భార‌త సంత‌తి వ్య‌క్తే కావ‌డం గ‌మ‌నార్హం. కానీ సురినామ్ దేశ అధ్య‌క్షుడు కూడా రిప‌బ్లిక్ వేడుక‌ల‌కు హాజ‌రు కావ‌డం లేదు  

1950 నుండి కేవలం 1966లో మాత్రమే విదేశీ అతిధి లేకుండా రిపబ్లిక్ ఉత్సవాలు జరిగాయి. నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణం చెందడం,  ఆయన తర్వాత ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధీ రిపబ్లిక్ డే కు కేవలం రెండు రోజుల ముందుగా, జనవరి 24న పదవీ బాధ్యతలు చేపట్టడంతో విదేశీ అతిధిని ఆహ్వానించడం  సాధ్యం కాలేదు.