ఎర్రకోటపై ఖలిస్తాని జెండా ఎగరేస్తే 2.5  లక్షల డాలర్లు!

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో సుమారు రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులను రేచ్ఛగొట్టేందుకు ఖలిస్తాని తీవ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై త్రివర్ణ పతాకంపై బదులుగా ఖలిస్తాని జెండాను ఎగరవేస్తే రూ 2. 5 లక్షల డాలర్ల బహుమతిని ప్రకటించారు. 
 
భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ `సిఖ్   ఫర్ జస్టిస్’ కు చెందిన గూర్పట్వేన్ట్ సింగ్ 1984 నాటి సిఖ్ వ్యతిరేక అల్లర్లతో కూడిన ఒక వీడియో సందేశాన్ని రైతుల శిబిరం వద్దకు పంపాడు. “జనవరి 26 వస్తున్నది. ఎర్రకోటపై భారత దేశపు త్రివర్ణ పథకం ఎగురుతున్నది. జనవరి 26న ఆ జెండాని తీసివేయండి. ఖలిస్థాన్ జెండాను ఎగరవేయండి”  అంటూ రెచ్చగొట్టే విధంగా ఈ బహుమతి ప్రకటన చేసాడు. 
 
రైతుల ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి ముఖ్యంగా కొన్ని ఖలిస్తాని తీవ్రవాద బృందాలు దీనిని సిఖ్ ల పోరాటంగా ప్రచారం చేస్తూ వస్తున్నాయి. 2.5 లక్షల డాలర్ల బహుమతితో పాటు ప్రదర్శకులను లోబరచుకొనేందుకు విదేశీ పౌరసత్వం కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు. 
 
ధన బలం, విదేశీ పౌరసత్వ ప్రలోభాలకు ఉపయోగించుకొని రైతు నిరసనకారులను దేశ వ్యక్తిరేక చర్యలకు ఆకర్షించే ప్రయత్నం `సిఖ్స్ ఫర్ జస్టిస్’  చేస్తున్నది. ” ప్రపంచ చట్టాలు మీకు అండగా ఉన్నాయి. భారత ప్రభుత్వం మిమ్ములను దోషులుగా చేస్తే మిమ్ములను, మీ కుటుంబాలను ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం విదేశాలకు తీసుకు వస్తాం”  అంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. 
 
మరోవంక, శతాబ్దాల తరబడి సోదరభావంతో మెలుగుతున్న హిందువులు, సిఖ్ ల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం కూడా ఖలిస్తాని ఉగ్రవాదులు చేస్తున్నారు. పైగా, రైతుల నిరసనలను 1984 నాటి సిఖ్ వ్యతిరేక అల్లర్లకు ప్రతీకారంగా జరుపుతున్న పోరాటంగా పణ్ణుమ్ అభివర్ణిస్తున్నాడు. ఢిల్లీ నగర వీధులలో ఖలిస్తాని ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనమని నిరసన శిబిరాలలో రైతులతో పాటు పంజాబ్, చండీఘర్ లోని పలువురు ప్రజలను కూడా టెలిఫోన్ చేసే ఆహ్వానిస్తున్నారు. 
 
అంతేకాదు, ఆయుధాలు ధరించి భారత ప్రభుత్వాన్ని బెదిరించాలని నిరసనకారులకు  ఆ వీడియో సందేశంలో పిలుపిచ్చారు. 
నిరసన శిబిరాలలో కొన్ని రైతు సంఘాలు జగ్తార్ సింగ్ హవార, జర్నైల్ సింగ్ భింద్రన్వాలె వంటి ఉగ్రవాదుల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. .

భారత అటార్నీ జనరల్ కేజీ వేణుగోపాల్ రైతుల ఉద్యమంలో ఖలిస్తాని ఉగ్రవాదులు చొరబడుతున్నారని అంటూ సుప్రీం కోర్ట్ దృష్టికి తీసుకు రావడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ విషయమై ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందిస్తూ అందుకు తగు ఆధారాలు చూపమని కోరారు. నిఘా వర్గాల నివేదికలను కోర్ట్ ముందుంచగలనని అయన తెలిపారు.

గత ఏడాది స్వతంత్ర దినోత్సవం రోజున ఖలిస్తాని జెండాను ఎస్ జె ఎఫ్ ఎగరవేసిన అనంతరం పంజాబ్ లో ఆరు ప్రదేశాలలో గత అక్టోబర్ లో ఎన్ ఐ ఎ బృందాలు సోదాలు చేపట్టాయి. సిఖ్ ల మానవహక్కుల పేరుతో ఎఫ్ జె ఎఫ్ పాకిస్థాన్ తో సహా అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నదని, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై వేర్పాటు వాదనలు వినిపిస్తున్నదని ఎన్ ఐ ఎ తెలిపింది.