బిజెపిలోకి 50 మంది టిఎంసి ఎమ్యెల్యేలు!

మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారంటూ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సంచలనప్రకటన చేశారు. బీజేపీకి చెందిన ఒక్క బూత్ ప్రెసిడెంటునైనా టీఎంసీలో చేరేలా ఒప్పించాలంటూ మంత్రి జ్యోతిప్రియా మల్లిక్‌కు ఆయన సవాల్ విసిరారు. 

టీఎంసీని వీడిన ఎమ్మెల్యేలంతా మళ్లీ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారంటూ మల్లిక్ చేసిన వ్యాఖ్యలను ఘోష్ కొట్టిపారేశారు. వచ్చే నెలలో టీఎంసీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని ఆయన వెల్లడించారు. 

‘‘బీజేపీకి చెందిన ఒక్క బూత్ ప్రెసిడెంటునైనా టీఎంసీలో చేరేలా ఒప్పిస్తే మల్లిక్ బాబు ఆరోపణలను నేను అంగీకరిస్తాను. వచ్చే నెలలో టీఎంసీ నుంచి కనీసం 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారు…’’ అని దిలీప్ ఘోష్ తెలిపారు.  టీఎంసీ పార్టీ నుంచి బయటికి వెళ్లినవారంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా మళ్లీ తిరిగి పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారంటూ మల్లిక్ ఇటీవల పేర్కొన్నారు. 

‘‘మే మొదటి వారంలో కనీసం ఆరు, ఏడుగురు బిజెపి ఎంపీలు టీఎంసీలో చేరబోతున్నారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు సైతం తిరిగి వచ్చేందుకు క్యూ కడుతున్నారు. బంకుర ఎమ్మెల్యే తుషార్ బాబు బుధవారంమే పార్టీలో తిరిగి చేరారు…’’ అని మల్లిక్ ప్రకటించారు.. కాగా మాజీ మంత్రి సువేందు అధికారి సహా పలువురు టీఎంసీ నేతలు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.