బిజెపిలోకి ప్రధాని మోదీ మాజీ కార్యదర్శి 

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గుజ‌రాత్ ముఖ్యమంత్రిగా  2001లో  బాధ్య‌త‌లు స్వీకరించిన‌ప్ప‌టినుంచి 2014 వ‌ర‌కు సీఎం కార్య‌ద‌ర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఎఎస్ అధికారి అర‌వింద్ కుమార్ శ‌ర్మ  నేడు బీజేపీలో చేరారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో న‌గ‌రంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న బీజేపీ స‌భ్య‌త్వం సుకున్నారు.
యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఆయనకు బీజేపీ కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శర్మ  ప్రకటించారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. పీఎంవోలో పనిచేసిన కారణంగా ఏకే శర్మ అనుభవం తమ పార్టీకి ఉపయోగపడుతుందని యూపీ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. 
1988 గుజ‌రాత్ క్యాడ‌ర్ ఐఏఎస్ అధికారి అయిన అర‌వింద్ కుమార్ శ‌ర్మ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మావు ప్రాంత వాసి. ఈ నెల 28న జ‌రిగే రాష్ట్ర శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో  ఆయ‌న ఎమ్మెల్సీగా ఎన్నికవ్వ‌నున్నారు. కేంద్ర సూక్ష్మ చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల (ఎంఎస్ఎంఈ)శాఖ కార్య‌ద‌ర్శిగా ఆయ‌న ప‌నిచేశారు.
వివిధ ప‌థ‌కాల్లో ఫ‌లితాల సాధించ‌డంలో అర‌వింద్‌కుమార్ శ‌ర్మ మేటి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మోదీకి అత్యంత విశ్వ‌సనీయుడిగా పేరొందారు. 2014లో మోదీ ప్ర‌ధానిగా ఎన్నికైన త‌ర్వాత కేంద్రానికి వ‌చ్చిన అర‌వింద్ కుమార్ శ‌ర్మ‌ గ‌తేడాది మేలో ఎంఎస్ఎంఈ శాఖ‌కు మారారు. క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ రంగానికి ఉప‌శ‌మ‌నం కోసం ప‌ని చేశారు.