ఏపీలో ఆలయాలపై దాడులంటూ దుష్ప్రచారం   

 ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులంటూ దుష్ప్రచారం జరుగుతోందని, సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిజిపి గౌతమ్ సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌‌లో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, సత్యదూరమని  స్పష్టం చేశారు.  అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదని సవాంగ్ హితవు చెప్పారు. ఈ మధ్య కాలంలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని అంటూ  ఆలయాలకు సంబంధించి మొత్తం 44 కేసులు ముఖ్యమైనవని చెప్పారు. ఆలయాలపై దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
పోలీసులకు సంబంధించిన కులం, మతంపై ఆరోపణలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. పోలీసులపై గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కులం, మతం ఆధారంగా పనిచేయరని స్పష్టం చేశారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆలయాల భద్రతా ప్రమాణాలను పాటిస్తోందని స్పష్టం చేశారు. పైగా, ఏపీలో ఆలయాలకు కల్పిస్తున్న భద్రతా ప్రమాణాలను  ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని పేర్కొన్నారు.
గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అంతర్వేది ఘటన దురదృష్టకరం అని తెలిపారు.  అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు.    ఏపీలో గత సెప్టెంబరు 5 నుంచి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేశామని తెలిపారు. అంతేకాకుండా  43,824 సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు, నిరంతర నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నామని చెప్పారు. 
 
ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో, 29 కేసులను ఛేదించడంతో పాటు  80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను/ ముఠాలను అరెస్ట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. గత సంవత్సరం(2020) సెప్టెంబర్ 5 అనంతరం  దేవాలయాలలో ప్రాపర్టీ అఫెన్స్‌కు సంబంధించిన 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్ చేశామని వివరించారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 23వేల 256 గ్రామ రక్షణ దళాలకుగాను, 15వేల 394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామని డిజిపి తెలిపారు. త్వరలోనే మిగిలిన 7862 గ్రామ రక్షణ దళాల ఏర్పాట్లను పూర్తి చేస్తామని చెప్పారు. కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో దేవాలయానికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.