రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిపై వేటు  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో మరో అధికారిపై వేటు పడింది. ఎపి ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీమోహన్‌ను విధుల నుండి తొలగిస్తూ ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.  కాగా, అంతకు ముందు ఎన్నికల సంఘం కార్యకలాపాలకు పథకం ప్రకారం విఘాతం కలిగించి పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకులు జివి సాయిప్రసాద్‌ను విధుల నుంచి సోమవారం తొలగించారు.
 
ఆ మరుసటి రోజే (మంగళవారం) ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీమోహన్‌ను కూడా తొలగించడం సంచలనంగా మారింది. ఈ మేరకు ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు.  వాణీమోహన్‌ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని లేఖలో తెలిపారు. వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  
 
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాణీమోహన్‌తోపాటు కార్యాలయంలో పని చేస్తున్న ఇతర సిబ్బంది కూడా ఈ నెల 9 నుంచి సెలవులు పెట్టకుండా అందుబాటులో ఉండాని నిమ్మగడ్డ కోరారు. అయినప్పటికీ కమిషనర్‌ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న సాయి ప్రసాద్‌ 30 రోజులపాటు సెలవుపై వెళ్తున్నట్లు లేఖ పంపారు. 
 
అంతేకాకుండా ఇతర ఉద్యోగులు కూడా సెలవుపై వెళ్లేలా ఆయన ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆర్టికల్‌ 243కె రెడ్‌విత్‌ 324 ప్రకారం విధుల నుంచి తొలగిస్తున్నట్టు రమేష్‌ కుమార్‌ వెల్లడించారు. తాజాగా వాణీమోహన్‌ను కూడా రిలీవ్‌ చేస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు.
 
మరోవంక, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఎస్‌ఈసీ తరపున లాయర్‌ అశ్విన్ కుమార్ గంటపాటు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది.