నాగార్జున సాగర్‌లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ గెలవబోతుందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి భరోసా వ్యక్తం చేశారు. మంగళవారం జహిరాబాద్‌లో పర్యటించగా బీజేపీ శ్రేణులు వివేక్ వెంకటస్వామికి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకలో, జీహెచ్‌ఎంసీలో బీజేపీ విజయం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడుతోందని చెప్పారు. వరుస ఓటముల తర్వాత సీఎం కేసీఆర్‌కి తెలిసొచ్చిందని, అందుకే పథకాలపై సమీక్షలు జరుపుతున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ కమీషన్ల రూపంలో దోచుకున్న రూ.లక్ష కోట్లన ప్రజా ధనాన్ని తాము అధికారంలోకి రాగానే కక్కిస్తామని స్పష్టం చేశారు. ఆ లక్ష కోట్ల కమీషన్లను రాష్ట్ర ఖజానాకు చేర్చడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు రూ.60 వేల కోట్లు ఉన్న అప్పును రూ.4 లక్షల కోట్లకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మండిపడ్డారు. ఆయన దోపిడీ వల్లే రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు.
కరోనా సమయంలో ఆయుష్మాన్ భారతి పథకం ఉండుంటే ఎంతో మంది పేదవారికి ఉపయోగపడేదని స్పష్టం చేశారు. కానీ అప్పుడు అమలు చేయకుండా ప్రైవేటు హాస్పిటళ్లతో కుమ్మక్కై పేదలను దోచుకున్నారని విమర్శించారు. జహిరాబాద్ ప్రాంతంలో చెరుకు రైతులకు బకాయిలు చెల్లించాలని కోరారు.
జహిరాబాద్‌లో మున్సిపల్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ గెలుస్తుందనే ఇక్కడ ఎన్నికలు జరపడం లేదని ధ్వజమెత్తారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో కేసీఆర్ విఫలం అయ్యారని దయ్యబట్టారు. నిమ్జ్ భూ నిర్వాసితుల సమస్యను పట్టించుకోవాలని, వారికి మార్కెట్ ధర ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.
More Stories
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు
కూల్చివేతలపై రాహుల్ ఆగ్రహం… రేవంత్ ధిక్కారస్వరం!