తెలంగాణలో జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్‌

జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ మంగళవారం జిఓ(4)ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్‌కుమార్ జారీ చేశారు. 
 
ఈ చట్టంలోని సెక్షన్ 16, 17 ప్రకారం స్పెషల్ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను ఆ జిఓలో ఆయన వెల్లడించారు. గెజిట్ ప్రకటించిన రోజు నుంచి ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఉనికిలోకి వస్తాయని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)లు ఉంటారని తెలిపింది. 
 
ఒకవేళ అదనపు కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంటే ఆ జిల్లాలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ల సభ్యుడిగా చేర్చాలని ఆ నిబంధనల్లో ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాలో ఇద్దరు అదనపు కలెక్టర్‌ల పోస్టులు ఖాళీగా ఉన్న పక్షంలో జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్‌ఓ)ను స భ్యుడిగా గుర్తించాలని, ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి ఆ జిల్లా పరిధిలోని కేసులన్నీ వస్తాయని ప్రభు త్వం తెలిపింది. 
 
ఈ ప్రత్యేక ట్రిబ్యునళ్ల అవసరాన్ని బట్టి జిల్లా కేంద్రం, డివిజనల్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కూడా సిట్టింగ్ జరిపి విచారణ నిర్వహిస్తాయి. అయితే ప్రత్యేక ట్రిబ్యునళ్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించేది లేదని, కలెక్టర్‌లు తమకు అనువుగా సిబ్బందిని జిల్లాలోని ఎక్కడినుంచైనా తీసుకోవచ్చని తెలిపింది. 
 
ఈ ట్రిబ్యునళ్ల ప్రోసీడింగ్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్డ్ రికార్డుల ఆధారంగా కేసుల విచారణ నిర్వహించనున్నారు. ప్రతి కేసుకు ఒక నెంబర్ ఇచ్చి వరుసగా ట్రాక్ చేసే వెసులుబాటును కల్పిస్తారు. నెంబర్‌లను కూడా కంప్యూటర్ విధానంలో ఇస్తారు. ఈ ట్రిబ్యునళ్లకు తెలంగాణ ల్యాండ్స్ ఇన్ రైట్ అండ్ పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020లోని సెక్షన్ 13 ప్రకారం అధికారాలు కల్పించనున్నారు. 
 
ట్రిబ్యునళ్లను బదిలీ చేసిన కేసులన్నింటిని విచారించే అధికారాన్ని కట్టబెట్టారు. అన్ని కేసులను సత్వరమే విచారించి వీలైనంత తొందరగా (నెలరోజుల్లో) పూర్తి చేసేలా ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ధేశించింది. పోస్ట్ డిస్పోజల్ యాక్షన్‌లో భాగంగా కేసులను ముగించిన తరువాత రికార్డుల్లో చేర్చడం, ఆఫీసు మాన్యువల్ ప్రకారం కలెక్టర్‌లు బాధ్యత తీసుకొని పూర్తి చేయాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. 
 
గతంలో తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్‌ల నేతృత్వంలో ఉన్న కోర్టులను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా జిల్లాకో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా కీలక ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది.

రాష్ట్రంలో రెవెన్యూ కోర్టుల తరువాత వివాదాలన్నీ సివిల్ కోర్టులకే పరిమితం అయ్యాయి. కానీ పెండింగ్ కేసులను పరిష్కరించే బాధ్యత కలెక్టర్‌లకు ప్రభుత్వం అప్పగించింది. రికార్డ్ ఆఫ్ రైట్, కౌలు రక్షిత చట్టం, ఇనాం యాక్టుల ద్వారా తహసీల్దార్‌లు, ఆర్డీఓలు, గతంలో జెసిలు రెవెన్యూ కోర్టులను నిర్వహించేందుకు వెసులుబాటు ఉంది.

 
అయితే ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం రికార్డుల్లో యాజమాన్య పేరు నమోదు అధికారం తహసీల్దార్‌లకే ఉంది. పేరు నమోదులో తహసీల్దార్ నిరాకరిస్తే అప్పీల్ ప్రకారం ఆర్డీఓను, ఆర్డీఓ తోసిపుచ్చితే జాయింట్ కలెక్టర్‌కు, జేసి తిరస్కరిస్తే సిసిఎల్‌ఏ వద్ద అప్పీల్‌కు అవకాశం ఉంది. అయితే కొత్త చట్టంలో కూడా అప్పీల్ వ్యవస్థకు ప్రభుత్వం మార్పులు చేసింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సేకరించిన ప్రాథమిక వివరాల మేరకు సివిల్ కోర్టుల్లో వివాదాలున్న భూములు 1,11,285 ఎకరాలుగా ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ కోర్టుల్లో 41,961 ఎకరాలకు చెందిన భూముల వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. 
 
భూ బదలాయింపు నిషేధ చట్టం (పిఓటి) వివాదాల భూములు 95,214 ఎకరాలుగా, కుటుంబ సర్వే రద్దు, బదల్ వివాదాలు 2,74,697 ఎకరాలుగా ప్రభుత్వం తేల్చింది. వీటితో పాటు ఇతర వివాదాలు 3,98,295 ఎకరాలకు చెందినవిగా అధికారులు గుర్తించారు. అయితే వీటిలో కొన్ని పరిష్కారం కాగా మరికొన్ని పెండింగ్‌లో ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు.

అయితే సివిల్ కోర్టుల్లో ఉన్న భూ వివాదాలను పరిష్కరించడానికి రానున్న రోజుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ డిస్‌ప్యూట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. 

 
జిల్లా ట్రిబ్యునళ్లకు కలెక్టర్ చైర్మన్‌గా, రాష్ట్ర స్థాయి అప్పీలేట్ ట్రిబ్యునల్‌కు రిటైర్డ్ సీనియర్ సివిల్ జడ్జిని చైర్మన్‌గా నియమించాలని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఇకపై హైకోర్టులో భూ వివాదాలను తేల్చేందుకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటును చేసేందుకు రెవెన్యూ చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది.