ఇమ్మిగ్రేషన్‌  చట్టాలు రద్దు చేస్తా  

అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ట్రంప్  తెచ్చిన ఇమ్మిగ్రేషన్‌  చట్టాలు రద్దు చేస్తామని జో బైడెన్ వెల్లడించారు. కొత్త ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని తీసుకురానున్నామని ప్రకటించారు.   
 
ముఖ్యంగా ఐటీ నిపుణులకు అందించే హెచ్1బీ వీసాల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తామని బైడెన్‌ ప్రకటించారు. 
ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న నిషేదాన్ని రద్దు చేయడంతోపాటు, ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనున్నారు. 
 
కొత్త ఇమ్మిగ్రేషన్‌ బిల్లును  పరిశీలనకు కమిటీలకు పంపించనున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న హెచ్‌1బీ వీసాల లాటరీ విధానానికి బైడెన్‌ స్వస్తి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
 
నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్‌1బీ వీసా జారీకి ఇప్పటివరకూ అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పి వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌లలో..పీహెచ్‌డీ చేసిన వారికి గ్రీన్‌కార్డు ఇచ్చే యోచనలో కూడా బైడెన్‌ ఉన్నారు. 
 
జనవరి 20 న పదవీ స్వీకారం తరువాత ఏం చేస్తారన్న ప్రశ్నలకు బైడెన్ స్పందించారు. అలాగే కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తక్షణమే ఆర్థిక సాయం చేయాల్సిందిగా కాంగ్రెస్‌ను అర్థిస్తానని కూడా బైడెన్‌ తెలిపారు.
 
 అధ్యక్ష పదవినిచేపట్టిన మొదటి రోజున పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరతామని కూడా బైడెన్‌ తెలిపారు. కాగా ట్రంప్‌ తీసుకొచ్చిన “క్రూరమైన” ఇమ్మిగ్రేషన్ విధానాలను రద్దుచేస్తామనేది బైడెన్‌ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి.