మోసగాళ్ల చేతిలో మోసపోయినవారికే ఈ చట్టం  

మధ్య ప్రదేశ్‌లో శనివారం నుంచి అమల్లోకి వచ్చిన మత స్వేచ్ఛ బిల్లు, 2020 వల్లన పెళ్లి పేరుతో మోసపోయిన అనేక మందికి ఈ చట్టం వల్ల న్యాయం జరుగుతుందని ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొనియాడారు.  మోసగాళ్ల చేతిలో మోసపోయినవారికి సాయపడే చాలా మంచి చట్టమని ఆమె  తెలిపారు.

ఓ సినిమా షూటింగ్‌ కోసం భోపాల్ వచ్చిన ఆమె మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈ చట్టం వల్ల చాలా మందికి సమస్యలు రావచ్చునని, అయితే మోసపోయినవారి కోసమే చట్టాలను రూపొందిస్తారని ప్రజలు అర్థం చేసుకోవాలని కంగనా రనౌత్ కోరారు.

సాధారణంగా జరిగే కులాంతర వివాహాలకు ఈ చట్టం వర్తించబోదని ఆమె స్పష్టం చేశారు. మతం లేదా కులం పేరుతో ఇతరులను మోసగించేవారికే ఇది వర్తిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో మోసపోయినవారికి ఈ చట్టం సహాయపడుతుందని తెలిపారు.

సౌదీ అరేబియా వంటి దేశాల్లో మహిళలపై నేరాలకు పాల్పడేవారిని బహిరంగంగా ఉరి తీస్తారని, మనం కూడా అలాంటి చర్యలను తీసుకోవలసిన అవసరం ఉందని ఆమె చెప్పారు. మత స్వేచ్ఛ బిల్లునే యాంటీ లవ్ జీహాద్ చట్టం అని కూడా అంటున్నారు.

ఈ ఆర్డినెన్స్ ప్రకారం, పెళ్లి పేరుతో మహిళను మతం మార్చిన వ్యక్తికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష, రూ.1 లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పెళ్లి చేసుకుంటానని, బెదిరించి, వేధించి, లేదా, ఏదైనా ఇతర మోసపూరితమైన పద్ధతుల ద్వారా వేరొకరిని మతం మార్చే వ్యక్తికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25,000 కన్నా తక్కువ కాకుండా జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది.