16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ  

జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ జరగనుంది. ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా కరోనా భయం గుప్పిట్లో బతికిన ప్రజలకు ఈ వార్త మంచి ఉపశమనం అని చెప్పొచ్చు. 
 
తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కరోనా యోధులకు, 50 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ప్రధాని మోదీ అధికారులతో జరిపిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై చర్చించారు. తొలి విడతలో మొత్తం 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ జరగనుంది.  
 
వ్యాక్సిన్‌ పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలపై అధికారులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘కొవాగ్జిన్‌’, ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
జనవరి 16న కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించడం ద్వారా కోవిడ్-19పై భారతదేశం మరో చారిత్రక ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. కోవిడ్-19‌ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న మన సాహసులైన డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు, సఫాయి కార్మికులకు తొలి ప్రాధాన్యతా క్రమంగా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు.
 
పుణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఈ వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా దేశంలోని 41 నిల్వ కేంద్రాలకు వ్యాక్సిన్లను తరలిస్తున్నారు.  
 
 కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌభ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలిచ్చారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో మాట్లాడిన కేంద్ర కేబినెట్ సెక్రటరీ డ్రై రన్‌లో ఎదురైన అనుభవాలపై చర్చించిన అంనతరం ఈ ఆదేశాలు జారీ చేశారు. 
 
అన్నిరాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ఆయన సమీక్షించారు. డ్రై రన్ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని  ఎలాంటి సమస్యలు  తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.