దివీస్‌ విషయంలో జగన్‌ మాట నిలబెట్టుకోవాలి  

దివీస్‌ విషయంలో జగన్‌ మాట నిలబెట్టుకోవాలి  
దివీస్‌ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు చెప్పారు. కాదని కేసులు పెడితే బాధితుల తరఫున ఎంతవరకయినా వెళ్తామని హెచ్చరించారు. 
 
దివీస్‌ కంపెనీకి జనసేన వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ పరిశ్రమ వల్ల కాలుష్యం వస్తుందనేది తమ  అభ్యంతరం అని తెలిపారు. రాదని సాంకేతికంగా నిరూపిస్తే అడ్డురామని చెప్పారు.  ఇందుకు న్యూట్రల్‌ వ్యక్తులతో కమిటీ వేసి కాలుష్యం లేదని చెబితే నమ్ము తామని, కానీ ఇస్టానుసారం చేస్తే మా సహనం పరీక్షించినట్లే ఆనుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   
 
దివీ్‌సను బంగాళాఖాతంలో కలిపేస్తామని పదవిలోకి రాకముందు చెప్పిన జగన్‌, తీరా అధికారంలోకి వచ్చాక అనుమతులు ఇవ్వడం ద్వారా ఏం విలువలు పాటిస్తున్నారని  పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఇలాంటి విలువలతో ఎలాంటి వ్యవస్థను నడపాలనుకుంటున్నారని నిలదీశారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలోని దివీస్‌ బాధిత ప్రాంతంలో శనివారం ఆయన పర్యతీస్తూ  ‘‘ఏ పరిశ్రమకు అయినా సగటు మనిషి ఆరోగ్యం, భవిష్యత్తును చెడగొట్టే అధికారం లేదు. భూమి అనేది వారసత్వంగా వచ్చే ఆస్తి. అది జగన్‌, వైసీపీ నేతల సొంతం కాదు”అని స్పష్టం చేశారు. 
 
ఇష్టానుసారంగా మీరు ఏది పడితే అది చేసుకుపోతే అడిగేవారు లేరనుకుంటున్నారా? అని నిలదీశారు. పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టడం కాదు. ప్రజల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని ముఖ్యమంత్రిని కోరారు. వైసీపీలా తాము పిచ్చిపిచ్చిగా తిట్లు తిట్టే వ్యక్తులం కాదని అంటూ మర్యాద ఇస్తాం. మీరు బూ తులు తిట్టినా మేం గౌరవంగా మాట్లాడతాం. ఆ గౌరవాన్ని వైసీపీ నిలబెట్టుకోవాలని హితవు చెప్పారు. 
 
దివీస్‌ వ్యతిరేక పోరాటంలో 36మంది బాధితులను జైల్లో పెట్టారని పేర్కొంటూ వాళ్లు ఏం తప్పు చేశారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాళ్లేమైనా సూట్‌కేసు కంపెనీలు పెట్టారా? హత్యలు, దొమ్మీలు చేశారా? కోడి కత్తితో పొడిచారా? అంటూ ఈ విషయం సీఎం జగన్ కు చెప్పమని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సూచించారు. 
 
వీరిని విడిచిపెట్టి సీఎం జగన్‌ పెద్ద మనసును చాటుకోవాలని కోరారు.  కాదని ఇవే పరిస్థితులు కొనసాగితే మళ్లీ వచ్చి కూర్చుంటా అని స్పష్టం చేసారు. దివీస్‌ కాలుష్యాన్ని సముద్రంలో కలిపేస్తాం అంటే ఒప్పుకోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.  ‘‘రేపు ఎన్నికలు వస్తే అండగా నిలవడం, నిలబడకపోవడం మీ ఇష్టం. నేను అడగను. సమస్య పరిష్కారమయ్యే వరకు జనసేన అండగా ఉంటుంది” అంటూ భరోసా ఇచ్చారు.