హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు  

ఏపీలో  పంచాయతీ ఎన్నికల ప్రకటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎన్‌ఈసీ) ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

ప్రభుత్వం వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇవాళ సమయం ముగిసిపోవడంతో సోమవారం విచారిస్తామని కోర్టు పేర్కొంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఎస్‌ఈసీ జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను నిలువరించాలని అభ్యర్ధించింది.

కరోనా వ్యాక్సినేషన్ సన్నద్ధతలో ప్రభుత్వశాఖల సిబ్బంది ఉండటం, కొత్తరకం స్ట్రెయిన్‌ భయం తదితర పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నది.

ఫిబ్రవరి 5 నుంచి 17వరకు నాలుగో దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ శుక్రవారం ప్రొసీడింగ్స్‌ విడుదల చేసి విషయం తెలిసిందే.