మాన‌వాళి ర‌క్ష‌ణ‌కు రెండు టీకాలు సిద్ధం

మానవాళిని కాపాడటానికి భారత్ రెండు `మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్‌‌లతో సిద్ధంగా ఉందని ప్రధాని ‘నరేంద్ర మోదీ ప్రకటించారు.  16వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సులో వర్చువల్‌‌గా ప్రధాని పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 ఈ సందర్భంగా ప్రవాసీయులతో మాట్లాడటం గొప్ప అవకాశమని మోదీ  చెప్పారు. ‘కరోనా మృతులు తక్కువగా, రికవరీలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. మానవాళిని రక్షించడానికి రెండు `మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్‌‌లతో ‘సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. ప్రపంచం భారతీయ వ్యాక్సిన్ ల కోసం ఎదురు చూడటమే కాకుండా, ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల కార్యక్రమాన్ని భారత్ ఏ విధంగా నిర్వహిస్తుందో అంటూ ఆసక్తిగా గమనిస్తున్నదని ప్రధాని చెప్పారు. 
 
ఈ కఠినమైన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు తమ విధులను నిర్వర్తించిన తీరు మనందరికీ గర్వకారణం అని ప్రధాని కొనియాడారు. ప‌్ర‌స్తుతం మ‌నం ఇంట‌ర్‌నెట్ ద్వారా ప్ర‌పంచ న‌లుమూల‌ల‌తో సంబంధాలు క‌లిగి ఉన్నామ‌ని, అయినా మ‌న మ‌న‌సులు మాత్రం ఎల్ల‌ప్పుడూ మాతృదేశంతోనే సంబంధాలు క‌లిగి ఉంటాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చెప్పారు. గ‌త కొన్ని సంవ‌త్సరాలుగా నాన్ రెసిడెంట్ ఇండియ‌న్స్ (ఎన్ఆర్ఐలు) ఇత‌ర దేశాల్లో మ‌రింత బ‌లోపేత‌మ‌య్యార‌ని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
దేశంలో క‌రోనా ప్ర‌భావం మొద‌లైన కొత్త‌లో భార‌త్ పీపీఈ కిట్‌ల‌ను, మాస్కుల‌ను, వెంటిలేట‌ర్‌ల‌ను, టెస్టింగ్ కిట్‌ల‌ను బ‌య‌టి నుంచి దిగుమ‌తి చేసుకునేద‌ని, కానీ ఇప్పుడు ఆ విష‌యంలో మ‌న దేశం స్వావ‌లంబ‌న సాధించిందని ప్ర‌ధాని మోదీ చెప్పారు. ప్ర‌స్తుతం మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా స్వ‌దేశీ సంస్థ‌లు త‌యారు చేసిన రెండు వ్యాక్సిన్‌ల‌తో మాన‌వాళిని ర‌క్షించేందుకు భార‌త్ సిద్ధంగా ఉన్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు.
భార‌త్ ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోనేందుకు గ‌ట్టిగా నిల‌బ‌డ‌టంతో ఇప్పుడు ప్ర‌పంచ‌మంతా ఉగ్ర‌వాదాన్ని ఎదిరించే శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను కూడ‌గ‌ట్టుకున్న‌ద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. అదేవిధంగా దేశంలో అవినీతి అంతానికి భార‌త్ సాంకేతిక‌త‌ను వినియోగిస్తున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం వివిధ సంక్షేమ ప‌థాకాల కింది ఇచ్చే ల‌క్ష‌ల‌, కోట్ల సొమ్ము ద‌ళారుల చేతికి వెళ్ల‌కుండా ఇప్పుడు నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో ప‌డుతున్న‌ద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.