‌బెంగాల్‌లో బీజేపీయే అధికారంలోకి వ‌స్తుంది   

‌బెంగాల్‌లో బీజేపీయే అధికారంలోకి వ‌స్తుంది   

ప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ జాతీయాధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాష్ న‌డ్డా భరోసా వ్యక్తం చేశారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల గ‌డువు స‌మీస్తున్న నేప‌థ్యంలో ఇవాళ ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించిన జేపీ న‌డ్డా వ‌ర్ధ‌మాన్ జిల్లాలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రోడ్ షోకు హాజ‌రైన ప్ర‌జ‌ల‌ను, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి న‌డ్డా ప్ర‌సంతీస్తూ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు ఖాయ‌మ‌ని, బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బెంగాల్ రైతుల‌కు అన్ని విధాలా మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు.

అధికార పార్టీ టీఎంసీని గద్దె దించేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీకి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. నకు ప్రజలు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారని, దీనినిబట్టి మమత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారని స్పష్టమవుతోందని చెప్పారు.

మ‌మ‌తాజీ..! ఎందుకంత భ‌యం..? ఏం జ‌రిగింది..? అంటూ బెంగాలీ భాష‌లో న‌డ్డా ఎద్దేవా చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు ఖాయమ‌నే సంకేతాలు అంద‌డంవ‌ల్ల‌నే మ‌మ‌తా బెన‌ర్జి ఆందోళ‌న చెందుతున్నార‌ని ధ్వజమెత్తారు.ప్రజల సంతోషం, విశ్వాసాలను చూసినపుడు తమను ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతించడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోందని చెప్పారు.

బర్ధమాన్ జిల్లాలోని జగదానందపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో నడ్డా మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో భాగంగా రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రేషన్ సరుకులను ఇచ్చిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. టీఎంసీ కార్యకర్తలు తమ ఇళ్ళను రేషన్ ఆఫీసులుగా మార్చేసుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అధికార పార్టీ చేసిన దోపిడీ ఇది అని ధ్వజమెత్తారు.

కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ స్కీమ్‌ను పశ్చిమ బెంగాల్‌లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి మమత బెనర్జీ అంగీకరించారని నడ్డా చెప్పారు. మమత బెనర్జీ ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందుకు రావడానికి కారణం ఆమె తన పట్టును కోల్పోతున్నట్లు తెలుసుకోవడమేనని ఎద్దేవా చేశారు. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను దాదాపు 70 వేల రైతు కుటుంబాలు పొందలేకపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మమత బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. తాము పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అనంతరం రాష్ట్రంలోని రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 

తాము రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, మరికొద్ది కాలంలోనే దాదాపు 4.66 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల లబ్ధి పొందుతారని నడ్డా ప్రకటించారు. 

నడ్డా అంతకుముందు ‘‘పిడికెడు బియ్యం’’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి పిడికెడు బియ్యం చొప్పున సేకరించి, రైతులకు, పేదలకు విందు ఏర్పాటు చేస్తారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.