గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ, జీతన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చాల ప్రభుత్వం అస్థిరతలో చిక్కుకున్నదని, ఈ ప్రభుత్వం పడిపోయి త్వరలో మధ్యంతర ఎన్నికలు జరగడం ఖాయం అని ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు ప్రకటనలు చేస్తుండగా, ప్రతిపక్ష కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీయే అస్థిరత ఎదుర్కొంటున్నట్లు వెల్లడి అవుతున్నది.
చాలా మంది ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని జేడీయూ నేతలు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలకు ఒక కాంగ్రెస్ నేత మరింత బలాన్ని చేకూర్చారు. 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్‌డీఏలో చేరేందుకు సిద్ధపడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు భరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.
ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత అజిత్ శర్మతో చెప్పానని కూడా ఆయన తెలిపారు. పార్టీ మారేందుకు సిద్ధమైన 11 మంది ఎమ్మెల్యేల పేర్లను సైతం సీఎల్పీ నాయకుడికి ఇచ్చానని, పార్టీని వీడేందుకు సిద్ధమైన వారిలో బిహార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా కూడా ఉన్నారని భరత్ సింగ్ ప్రకటించారు. మదన్ మోహన్ ఝా ఇప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చౌదరి బాటలో పయనిస్తున్నారని భరత్ సింగ్ ఆరోపించారు.
ఈ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు ఇచ్చి టికెట్ తీసుకొని ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపణలు చేశారు. వీరంతా త్వరలోనే ఎన్డీఏలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. అశోక్ చౌదరి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలుచుకుంది. అప్పుడు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
అశోక్ చౌదరి ఆ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన నితీశ్‌తోనే ఉన్నారు. ఆ తరువాత నితీశ్ మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సైతం అశోక్ చౌదరి కాంగ్రెస్ పార్టీని వీడి జేడీయూలో చేరారు. ప్రస్తుతం చౌదరి విద్యా శాఖ మంత్రిగా, జేడీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర కాంగ్రెస్ పూర్తిగా చీలిపోతుందని అందరూ భావించారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు.ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో ఊగిసలాడుతున్నారు.
More Stories
స్కామ్లకు అడ్డాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం
కెనడాలో హిందూ ఆలయంపై దాడి పిరికిపంద చర్య
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది