గుజరాత్‌ మాజీ సీఎం మాధవ్‌ సింగ్‌ సోలంకి కన్నుమూత

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాధవ్‌సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు.
 
మాధవ్‌సింగ్ సోలంకి 1980ల్లో గుజరాత్‌లో కేహెచ్‌ఏఎం (క్షత్రియా, హరిజన, ఆదివాసీ, ముస్లిం) సూత్రంపై అధికారంలోకి వచ్చారు. 1980 ఎన్నికలకు ముందు కేహెచ్‌ఏఎం కూటమిని ఏర్పాటు చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సోలంకి.. 1976లో కొంతకాలం ముఖ్యమంత్రి పని చేశారు. మళ్లీ 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. 
 
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. 1985లో రాజీనామా చేసినప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 149 గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. 
 
మాజీ సీఎం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలు పాటు గుజరాత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాధవ్‌సింగ్ సోలంకి బలీయమైన నాయకుడని కొనియాడారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తన కుమారుడు భారత్‌తో మాట్లాడి, సంతాపం తెలిపినట్లు ట్వీట్‌ చేశారు.  
 
‘రాజకీయాలను పక్కనపెడితే.. మాధవ్‌సింగ్ సోలంకి చదవడం పట్ల ఎంతో ఇష్టంగా ఉండేవారు. ఆయన సంస్కృతి పట్ల మక్కువ కలిగి ఉన్నారు. నేను ఆయనను కలిసినప్పుడు లేదా ఆయనతో మాట్లాడినప్పుడల్లా పుస్తకాల గురించి తప్పకుండా చర్చిస్తాం. ఆయన ఇటీవల చదివిన కొత్త పుస్తకం గురించి నాకు చెప్పాడు. నేను ఆయనను కలవడానికి ఎప్పుడూ ఇష్టంగానే ఉంటాను’అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.