9 ఆలయాల పునర్నిర్మాణానికి జగన్ భూమి పూజ

గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చి వేసిన 9 గుడులను పునఃనిర్మించే పనులకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11.01కి కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

అనంతరం అక్కడ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.  దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు.

 అలాగే రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆల‌యాల నిర్మాణం దేవాదాయ శాఖ‌, సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను పుర‌పాల‌క శాఖ చేప‌డుతుంది. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.  అనంతరం దేవాదాయ శాఖ రాష్ట్రంలోని వివిధ ఆలయాలపై రూపొందించిన క్యాలండర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

 దేవాదాయ శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ  సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.  రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో రూపొందించిన క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి చూసి అధికారులను అభినందించారు. ఆయా దేవస్థానాల్లో నిర్వహించే వేడుకలను ప్రతిబింభించేలా క్యాలెండర్‌ను రూపొందించారు.