అన్ని మతాలతో కమిటీలపై జివిఎల్ అభ్యంతరం 

ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉంటె వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని మతాల వారితో కమిటీలు వేస్తామని ప్రకటించడం పట్ల బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కమిటీలు అంటూ ప్రజలు ను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎపి లో హిందూ మతం పై దాడి జరుగుతుంటే అన్ని‌మతాలతో కమిటీలు ఎందుకని ప్రశ్నించారు.

ఇతర  మతాల పెద్దలు, కమిటీలు ఈ దాడులను ఎందుకు ఖండించరని ఆయన నిలదీశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడం పై ఎందుకు ప్రశ్నించరని విస్మయం వ్యక్తం చేశారు.  ఈ దాడులకు సంబంధించిన ఆధారాలు సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
కమిటీలు లో అన్ని మతాల నుంచి ప్రతినిధులు ఉంటారని చెబుతున్నారని పేర్కొంటూ ఎపి లో తొంభై‌శాతం హిందువులు ఉన్నారని, హిందూ మతం పై దాడి చేస్తే  ఇతర మతస్తులు కమిటీలు లో ఉండి ఏం‌ చేస్తారని నిలదీశారు.

ఇక్కడ మతం పై మరో మతం వారు దాడి చేయడం లేదని, అందరూ అన్మ దమ్ముల్లా కలిసి ఉన్నారని జివిఎల్ చెప్పారు. దయచేసి వారి మధ్య విద్వేషాలు సృష్టించ వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. హిందూ వ్యతిరేక రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఇప్పటి‌వరకు దాడుల ఘటనల్లో ఎంత మందిని అరెస్టు చేశారు?  వారెవరు, ఏ సెక్షన్లు పెట్టారో.. ప్రభుత్వం ఎందుకు చెప్పదని నిలదీశారు. వైసిపి రాజకీయ భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని హితవు చెప్పారు.

హిందూ పెద్దలు ఎందరో ఈ దాడులను ఖండించారని,  ఇతర మతాల పై దాడి వద్దని చెప్పారని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా ఆయా మత పెద్దలు కుడా తమ వారికి ప్రకటనలు చేయాలని జివిఎల్ డిమాండ్ చేశారు.

 
రామతీర్థం వెళ్లాలంటే బిజెపి నేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని జివిఎల్ ప్రశ్నించారు. వైసిపి, టిడిపి నాయకులకు లేని ఆంక్షలు బిజెపి వారికే ఎందుకు అమలు జరుపుతున్నరని నిలదీశారు.  బిజెపి కన్నెర్ర చేస్తే  ప్రాంతీయ పార్టీ లు అడ్రెస్ లేకుండా పోతాయని జివిఎల్ హెచ్చరించారు. 
 
నిన్న రామతీర్థం లో జరిగిన పరిణామాలను కేంద్రం, పార్టీ పెద్దలకు వివరించామని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడిగి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు.   అమిత్ షా కు కూడా వినతి పత్రం ద్వారా పరిస్థితి వివరిస్తామని వెల్లడించారు. మొన్న తమకు అనుమతిస్తుంది ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నిన్న ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని మండిపడ్డారు.
వైసిపి ప్రభుత్వం అకృత్యాలు ను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
 
ఎపి లో హిందూ ఆలయాల  పైన దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆకతాయిల పనిగా ప్రచారం చేసి, చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. రామతీర్థం లో రాముని తల తొలగిస్తే అన్ని వర్గాలు ఆవేదన చెందారని గుర్తు చేశారు. అయితే నిందితులపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జివిఎల్ విమర్శించారు.
 
ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు చెబుతున్నట్లుగా టిడిపి‌ వారే ఈ. దాడులు చేయిస్తే  వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి, టిడిపి ల మధ్య రహస్య ఒప్పందం ఏమైనా ఉందా? అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు. బయట తిట్టుకుంటూ.. అంతర్గతంగా కలిసి పని‌చేస్తున్నారా? అని ప్రశ్నించారు.