8.9 శాతం వృద్ధితో దూసుకెళ్తున్న భారత ఆర్ధిక వ్యవస్థ 

8.9 శాతం వృద్ధితో దూసుకెళ్తున్న భారత ఆర్ధిక వ్యవస్థ 

కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న భారత దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. 2021 ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 8.9 శాతం వృద్ధితో దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. 

ఈ ఏడాది మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం తగ్గుతుందని నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఓ) గురువారం ప్రకటించింది.  నాలుగు దశాబ్దాల్లో అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉన్న సంవత్సరం ఇదేనని ఎన్ఎస్ఓ పేర్కొంది.

ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ ఐహెచ్ఎస్ మర్కిత్ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో, భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2020లో తీవ్ర మాంద్యాన్ని చవి చూసిందని పేర్కొంది. 2020 మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో అత్యంత దయనీయమైన తగ్గుదల కనిపించిందని తెలిపింది. 

2020 సెప్టెంబరు నుంచి ఆర్థిక కార్యకలాపాలు బలంగా పుంజుకున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనాన్ని అమలు చేయడం వల్ల జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 23.9 శాతం క్షీణించింది.

ఆ తర్వాత మూడు నెలల్లో ఈ క్షీణత 7.5 శాతానికి తగ్గింది. అక్టోబర్ డేటాను పరిశీలించినపుడు పారిశ్రామికోత్పత్తి, 2020 ఏప్రిల్‌లో క్షీణత మైనస్ 55.5 శాతంతో పోల్చినపుడు, 3.6 శాతం పెరిగింది. 2020 నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే భారత దేశ ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగ్గ ప్రగతిని చూపించింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.9 శాతంతో తిరిగి పుంజుకుంటుందని అంచనా.

తయారీ రంగంలో చెప్పుకోదగిన పురోగతి సాధిస్తున్నట్లు చెబుతూ డిసెంబర్ లో ఆర్దర్లు కరోనా ముందు నాటి స్థితికి చేరుకున్నట్లు తెలిపింది. డిమాండ్ తో పాటు, మార్కెట్ పరిస్థితులు గణనీయంగా మెరుగైన్నట్లు వివరించింది. 

135 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించడం భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ అని చెబుతూ,  ఇప్పటికే ఆక్స్ఫర్డ్/ఆస్ట్రా జెనిక వ్యాక్సిన్ ను భారత్ లోని సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి ప్రారంభించడం, ఏప్రిల్ నాటికి 10 కోట్ల డోస్ లను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించడం మంచి పరిణామమని పేర్కొన్నది. 

ప్రభుత్వం చేసే వ్యయం మినహా వచ్చే ఏడాది ప్రైవేట్ రంగం, ఎగుమతులు, దిగుమతులు, వినియోగం – అన్ని రంగాలలో చెప్పుకోదగిన వృత్తి ఉండగలదని అంచనా వేస్తున్నారు.