పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో శనివారం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల అనంతర హింసాకాండ బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంగా ఆయనపై గుడ్లు, రాళ్లు విసిరారు. ఇదే సమయంలో బీజేపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా ‘దొంగ దొంగ’ అని నినాదాలు చేశారు.
ఈ దాడి నుంచి అభిషేక్‌కు కాపాడేందుకు భద్రత సిబ్బంది తమ హెల్మెట్ ఇచ్చి రక్షణగా నిలిచారు. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని టీఎంసీ ఆరోపించింది. అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో భద్రతా సిబ్బంది ఆయనను చుట్టుముట్టి రక్షణగా నిలుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ఈ దాడిని బీజేపీయే ప్రోత్సహించిందని అభిషేక్ బెనర్జీఆరోపించారు.
“ఇదంతా బీజేపీయే ప్రోత్సహించింది. వాళ్లు ఏం చేశారో చూడండి. ఇదేనా వాళ్ల ప్రజాస్వామ్యానికి ఉదాహరణ. నెల కూడా కాలేదు, పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు’’ అని ఆయన ధ్వజమెత్తారు. దాడి చేసినవారు తనను చంపడానికే వచ్చారని ఆరోపించిన బెనర్జీ ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయిందని పేర్కొన్నారు. తాను తృటిలో తీవ్ర గాయాల నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ‘
అంతేకాదు, ‘‘ఘటనా స్థలంలో పోలీసుల ఉనికి లేదు. వారు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. చంపనివ్వండి.. నేను చావనైనా చస్తాను కానీ ఇక్కడ నుంచి కదలను’’ అని ఆయన విమర్శించారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేసే వరకు తాను వెళ్లబోనని తేల్చిచెప్పారు. ఉద్రిక్తతల నడుమ పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని బెనర్జీని రక్షించారు,
బీజేపీ ప్రభుత్వంపై తన విమర్శలను తీవ్రతరం చేస్తూ, బెనర్జీ ఇంకా ఆరోపిస్తూ, “స్వాతంత్య్రం తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా డబ్బులు తీసుకుంటూ కనిపించలేదు. కానీ ఒక బీజేపీ ముఖ్యమంత్రి డబ్బులు తీసుకుంటూ కనిపించారు. నన్ను చంపాలనుకుంటే చంపనివ్వండి. నా మృతదేహాన్ని ఇక్కడి నుంచే వెలికి తీయాలి. నేను ఈ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలిపెట్టను. నేను హైకోర్టును, గవర్నర్‌ను ఆశ్రయిస్తాను” అని స్పష్టం చేశారు.
“వారు (బాధితురాలి ఇంటి) తలుపు పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ఇక్కడ పోలీసు బలగాలు లేవు. భద్రతా దళాలు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వారు ఆ కుటుంబాన్ని బెదిరించి, నన్ను ఇక్కడికి రానివ్వవద్దని చెప్పారు. వారెందుకు అంత భయపడుతున్నారు?” అంటూ ప్రశ్నించారు.
బిజెపి మద్దతుదారుల నిరసనలు, నినాదాలు
ఇదిలా ఉండగా, పటులి సమీపంలోని ధలాయ్ వంతెన నుంచి సోనార్‌పూర్‌లోని కమ్రాబాద్ వరకు పలుచోట్ల బీజేపీ మద్దతుదారులు టీఎంసీ నాయకురాలికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు. పలువురు మహిళా నిరసనకారులు చీపుర్లు పట్టుకుని ఇంటి బయట గుమిగూడి బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం-హత్య కేసులో టీఎంసీ నాయకత్వం పాత్రను కొందరు ప్రశ్నించారు.
“వారు దోషులను రక్షించారు. ఆర్.జి. కార్ బాధితుడికి యావత్ దేశం సంఘీభావం తెలుపుతున్నప్పుడు వారెక్కడ ఉన్నారు?”అని నిరసనకారులలో ఒకరు ఆరోపించారు. నిరసనలు తీవ్రతరం కావడంతో, ప్రదర్శనకారులు నినాదాలు కొనసాగిస్తుండగా, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు మరియు స్థానిక పోలీసు సిబ్బందితో కూడిన భారీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.అనంతరం భద్రతా సిబ్బంది బెనర్జీని ఆ ప్రాంతం నుండి బయటకు తీసుకువెళ్లారు.
బెనర్జీ తన వాహనం వద్దకు తిరిగి నడిచి వెళ్లిన దాదాపు ఒక కిలోమీటరు మేర పోలీసులు, కేంద్ర బలగాలు భారీ భద్రతను కల్పించాయి. ఈ ఘటన తర్వాత, బెనర్జీని చికిత్స కోసం ఈఎం బైపాస్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ చైర్పర్సన్ మమతా బెనర్జీ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి తరలిరావడం కనిపించింది.
పాలకులు హంతకులయ్యారని, బీజేపీకి ఇది సిగ్గు చేటు అని పేర్కొంటూ టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. దాడిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా ఖండిస్తూ రాజకీయ భేదాభిప్రాయాలున్నంత మాత్రాన హింసకు దిగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని తప్పుపట్టారు.
ఆరోపణలను ఖండించిన బిజెపి
ఈ ఆరోపణలపై స్పందిస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ షామిక్ భట్టాచార్య ఈ ఘటనను ఖండించారు. ఇందులో తమ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆయన తోసిపుచ్చారు. “ఇలాంటి చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటనతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఆరోపించినట్లుగా పోలీసులు ఎందుకు అక్కడ లేరో నాకు తెలియదు” అని తెలిపారు. సువేందు అధికారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉత్తర బెంగాల్లో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు.
“ఏళ్ల తరబడి బీజేపీ కార్యకర్తలు ఎన్నో అఘాయిత్యాలు ఎదుర్కొన్నప్పటికీ, మా కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారు. ఒకవేళ పరిస్థితి తారుమారు అయి, టీఎంసీ ఇంకా అధికారంలో ఉండి ఉంటే, చాలా మంది ప్రతిపక్ష నాయకులు సురక్షితంగా ఆ ప్రదేశానికి చేరుకోలేకపోయేవారు. అయినప్పటికీ, ఎలాంటి హింస అయినా ఆమోదయోగ్యం కాదు,” అని భట్టాచార్య స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, సీఐడీకి చెందిన నలుగురు సభ్యుల బృందం బెనర్జీ నివాసమైన హరీష్ ముఖర్జీ రోడ్‌కు వెళ్లగా, డైమండ్ హార్బర్ ఎంపీ అక్కడ లేరని తెలిసింది. అనంతరం కాళీఘాట్ రోడ్ ఇంటికి తిరిగి వచ్చిన సీఐడీ అధికారులకు, ఎంపీ తీరిక లేకుండా ఉన్నారని, వెంటనే వారిని కలవలేరని చెప్పడంతో, వారు కొన్ని గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. సమన్లకు గల కారణం ఇంకా అస్పష్టంగా ఉంది.
కాగా, శోభన్‌దేబ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా నామినేట్ చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు సమర్పించిన లేఖపై టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై సీఐడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. ఈ విషయమై టీఎంసీ ఎమ్మెల్యేలు నయన బంద్యోపాధ్యాయ, కునాల్ ఘోష్, బహరుల్ ఇస్లాం, చంద్రనాథ్ సిన్హాలను సీఐడీ ఇప్పటికే ప్రశ్నించింది.వారి సంతకం, చేతిరాత నమూనాలను కూడా సేకరించింది.
More Stories
కాక్రోచ్ జనతా పార్టీతో ఆందోళన అనవసరం… ఆర్ఎస్ఎస్
కరాచీలో దావూద్ ఇంటి నుంచి నడిపిస్తున్న ఉగ్రకుట్ర ఢిల్లీలో భగ్నం!
వినేశ్ ఫొగాట్‌కు ఆసియా క్రీడల ఎంపికలో గట్టి ఎదురుదెబ్బ