అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ మంగళవారం క్యాపిటల్ భవనంలో జరిగిన సమావేశం హింసాత్మకంగా మారింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసకు దారి తీసింది. వందలాది మంది భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు.
వారిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల కళ్లలో రసాయనాలను చల్లి క్యాపిటల్ భవనంలోకి దూసుకువెళ్లారు. అప్పటికే సమావేశంలో ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ నేతృత్వంలో రాష్ట్రాల వారీగా ఓట్ల ధ్రువీకరణ ప్రక్రియ సాగుతోంది. అలబామా, ఆలస్కాలో ఓట్లను ధ్రువీకరించారు. ఆ రెండు రాష్ట్రాల్లో 12 అక్కడ గెలిచిన ఓట్లు ట్రంప్‌కే దక్కాయి.
అదే సమయంలో ట్రంప్ మద్దతుదారులు చొచ్చుకువెళ్లడంతో సమావేశం జరుగుతున్న భవనాన్ని మూసివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కాంగ్రెస్ సభ్యులు గ్యాస్ మాస్కులు ధరించాలని సిబ్బంది సూచించారు. ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ సహా మిగతా సభ్యులందరినీ వెంటనే మరోమార్గంలో నుంచి తరలించారు.
భవనం అద్దాలు పగులగొట్టి లోపలికి చేరిన ట్రంప్ మద్దతుదారులు లోపల హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో భవనంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆందోళనకారులతో జరిగిన ఘర్షణలో పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు.
పరిస్థితి అదుపు తప్పడంతో జాతీయ గార్డ్ సిబ్బందిని తరలించారు. ఘటనపై ట్రంప్ స్పందిస్తూ ఆందోళనకారులు ఇండ్లకు వెళ్లిపోవాలని పిలుపునిచ్చారు. మనకు శాంతి కావాలని, శాంతిభద్రతలను కాపాడే గొప్ప వ్యక్తులను మనం గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ శాంతియుతంగా ఉండాలని, రిపబ్లికన్ పార్టీ అంటే శాంతి భద్రతలను కాపాడే పార్టీ అని పేర్కొన్నారు.
అధ్యక్ష ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని ట్రంప్ మరోసారి తోసిపుచ్చారు. బైడెన్ ఎన్నికను తోసిపుచ్చాలని చేసిన వినతిని మైక్‌పెన్స్ తిరస్కరించడంతో ఆయనపై విరుకుపడ్డారు. పెన్స్ తన నిజాయితీని చూపలేదని ఆరోపించారు. సుమారు నాలుగు గంటల ఆందోళనల తర్వాత పోలీసులు క్యాపిటల్ భవనం నుంచి అందరినీ ఖాళీ చేయించారు. అనంతరం సురక్షితమేనని ప్రకటించారు.
ఆందోళనకారులు లోపలికి వచ్చే లోపే భవనంలో ఉన్న ఓట్ల బాక్సులను భవనం నుంచి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆందోళన నేపథ్యంలో సాయంత్రం ఆరుగంటల వరకు వాషింగ్టన్‌లో కర్ఫ్యూ అమలులోకి తీసుకువచ్చారు. అధికారులు భవనం సురక్షితమేనని ప్రకటించిన అనంతరం అమెరికా కాంగ్రెస్ భేటీ మళ్లీ ప్రారంభమైంది.
ట్రంప్ మద్దతుదారులు చేపట్టింది నిరసన కాదు.. తిరుగుబాటేనంటూ జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాపిటల్ భవనం వద్ద జరిగిన దాడి ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఆధునిక కాలంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరుగలేదని పేర్కొంటూ ఆందోళన సందర్భంగా కనిపించిన దృశ్యాలు నిజమైన అమెరికాను ప్రతిబింభించవని స్పష్టం చేశారు. కొద్ది మంది ఉగ్రవాదులు చట్టాన్ని ఉల్లంఘించారని చెబుతూ ఇది దేశద్రోహమని మండిపడ్డారు.
More Stories
హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల మోసం.. అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మీడియాపై 50 శాతం పెరిగిన దాడులు!
సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు