బర్డ్‌ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం

బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్నట్లు నిర్థరణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ న్యూఢిల్లీలో ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి నిర్థరణ అయిన నేపథ్యంలో ప్రతి రోజూ పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు తీసుకుంది. 

రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న నిరోధక, నియంత్రణ చర్యలను మదింపు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతవరకూ 5 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని కేంద్ర వ్యవసాయ, ఫుడ్ ప్రోసెసింగ్ శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్ తెలిపారు. 

బర్డ్ ఫ్లూ అనేది భారత్ కు కొత్తేమీ కాదని చెబుతూ యాతో 2015 నుంచి శీతాకాలంలో బర్డ్ ఫ్లూ కేసులు దేశంలో నమోదమవూనే ఉన్నాయని చెప్పారు.  ఇదేమీ కొత్త ట్రెండ్ కాదు. భారత్ లో 2006లో మొదటి సారి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఆ తర్వాత 2015 నుంచి ఏటా కొన్ని కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 

ఈ బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ మ‌నుషుల‌కు కూడా సంక్రమించే అవ‌కాశం ఉన్న‌ద‌ని, అయితే ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో ఎక్క‌డా మ‌నుషుల్లో ఈ వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌ని సంజీవ్ బ‌ల్యాన్ స్పష్టం చేశారు.  బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, చనిపోయిన పక్షలను సరిగా డిస్పోజ్ చేయాలని అన్ని రాష్ట్రాలను కోరినట్టు మంత్రి చెప్పారు. 

‘దీనికి చికిత్సంటూ ఏమీ లేదు. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే. కేరళ, హర్యానాలో మాత్రమే పౌల్ట్రీలలో ఈ కేసులు నమోదయ్యాయి. కేరళలో ఒక బాతులో, హర్యానాలో ఒక పౌల్ట్రీలో వైరస్ బయటపడింది’ అని బల్యాన్ తెలిపారు.

కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ విడుదల చేసిన ప్రకటనలో దేశంలో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా నిరోధం, నియంత్రణ, కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాల జారీ కోసం 2005లో చర్యల ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపింది. దీనిని 2006, 2012, 2015 సంవత్సరాల్లో సవరించినట్లు తెలిపింది. తాజాగా 2021లో కూడా దీనిని సవరించినట్లు పేర్కొంది.

కలుషిత పౌల్ట్రీ ఉత్పత్తులను వినియోగించడం వల్ల మానవులకు బర్డ్ ఫ్లూ సోకుతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. వైరస్‌లు, బ్యాక్టీరియా పశువులకు, పక్షులకు, మొక్కలకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.  బర్డ్‌ ఫ్లూ కారణంగా దేశవ్యాప్తంగా 25వేల పక్షులు మరణించాయి.

వలస పక్షుల కారణంగానే బర్డ్‌ ఫ్లూ ‌ వ్యాప్తి చెందుతోందని, ముఖ్యంగా ఉత్తర, దక్షిణాది ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళన కలిగించేవిధంగా ఉందని కేంద్ర మత్స్య పశుసంవర్థక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ బుధవారం పేర్కొంది. సెప్టెంబర్‌- అక్టోబర్‌ నుండి ఫిబ్రవరి-మార్చి మధ్యలో జరిగే వలస పక్షులతో బర్డ్‌ఫ్లూ వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంది.

వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని పేర్కొంది. పారిశుద్ధ్యం, ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ చర్యలు తీసుకుంటే ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల వ్యాప్తిని నియంత్రించవచ్చునని పేర్కొంది.

కేరళలోని కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్నట్లు నిర్థరణ అయింది. దీంతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లో సుమారు 1,800  వలస పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. రాజస్థాన్‌లో దాదాపు 425 పక్షులు చనిపోయాయి. మధ్య ప్రదేశ్‌లో సుమారు 152 కాకులు ప్రాణాలు కోల్పోయాయి.