డొనాల్డ్ ట్రంప్‌ అరెస్టుకు ఇరాక్ కోర్టు వారంట్ 

అమెరికా అధ్యక్ష పదవి నుంచి త్వరలో వైదొలగబోతున్న డొనాల్డ్ ట్రంప్‌ అరెస్టుకు ఇరాక్ కోర్టు గురువారం వారంట్ జారీ చేసింది. ఇరానియన్ జనరల్, ఇరాకీ మిలీషియా లీడర్‌ హత్య కేసులో ఈ అరెస్ట్ వారంట్ జారీ అయింది.

బాగ్దాద్ కోర్టు మీడియా కార్యాలయం గురువారం తెలిపిన వివరాల ప్రకారం, జనరల్ ఖాసిం సోలిమని, అబు మహ్ది అల్ ముహండిస్ గత ఏడాది జనవరిలో జరిగిన డ్రోన్ దాడిలో మరణించారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిన బాగ్దాద్ ఇన్వెస్టిగేటివ్ కోర్టు జడ్జి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అరెస్ట్ వారంట్ జారీ చేశారు. 

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై పోరాడేందుకు ఏర్పాటు చేసిన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌కు డిప్యూటీ లీడర్‌గా అల్ ముహండిస్ వ్యవహరించేవాడు. ఈ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌లో ఇరాన్ మద్దతుగల దళాలు కూడా ఉంటాయి. 

సోలిమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌లో కుద్స్ ఫోర్స్ అధిపతిగా ఉండేవాడు. వీరిద్దరూ గత ఏడాది జనవరిలో బాగ్దాద్ విమానాశ్రయం వద్ద జరిగిన డ్రోన్ దాడిలో హతులయ్యారు. వీరిని ముందస్తు ప్రణాళికతో హత్య చేశారని ఆరోపణలు నమోదయ్యాయి.

ఈ నేరం రుజువైతే దోషికి మరణ శిక్ష విదించవచ్చు. డొనాల్డ్ ట్రంప్‌పై జారీ చేసిన అరెస్ట్ వారంట్ అమలయ్యే అవకాశం లేదు. కానీ, ఆయన పదవి నుంచి వైదొలగబోతున్న సమయంలో దీనిని జారీ చేయడం ఈ దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి గుర్తుగా భావించవచ్చు.

ఈ జంట హత్యలతో అమెరికా-ఇరాక్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దేశం నుంచి విదేశీ దళాలను పంపించేయాలని షియా రాజకీయ నేతలు తీర్మానం చేశారు. ఇరాన్ మద్దతుగల దళాలు ఇరాక్‌లో అమెరికా దళాలపై దాడులను పెంచాయి. దీంతో బాగ్దాద్‌లో దౌత్య కార్యాలయాన్ని మూసేస్తామని అమెరికా హెచ్చరించింది.