ఎట్టకేలకు ఓటమి అంగీకరించిన ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. జో బెడెన్‌దే గెలుపంటూ అమెరికా కాంగ్రెస్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే  తాను స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకుంటానని, అధికార మార్పడి పద్ధతి ప్రకారం జరుగుతుందని  ప్రకటించారు. 
 
‘ఎన్నికల ఫలితాలను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ..వాస్తవాలు కూడా నన్నే సమర్థిస్తున్నప్పటికీ జనవరి 20న నిబంధనల ప్రకారం అధికార మార్పిడి జరుగుతుంది. అమెరికా చరిత్రలోనే మహాద్భుత పాలనకు దీంతో ముగింపు పడినట్టైంది. అయితే. గొప్ప దేశాన్ని సాకారం చేసేందుకు మేం చేస్తున్న పోరాటానికి మాత్రం ఇది ఆరంభం’ అని ఆయన ప్రకటించారు.  

అంతకు ముందు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ గెలిచినట్టు అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. విజయానికి కావాల్సిన 270 ఓట్ల మ్యాజిక్ ఫిగర్‌ను బైడెన్ సాధించినట్టు కాంగ్రెస్ పేర్కొంది. అధ్యక్షుడిని ఎన్కుకునే ఎలక్టోర్ కాలేజీ సభ్యుల్లో 306 మంది బైడెన్‌కు మద్దతు తెలుపగా, 232 మంది సభ్యులు ట్రంప్‌కు అనుకూలంగా ఓటు వేశారు. 

క్యాపిటల్‌ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడితో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆధ్వర్యంలో రెండు సభలు సంయుక్తంగా సమావేశమై బైడెన్ విజయాన్ని ధృవీకరించాయి. దీనికి కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ మాత్రం బెడెన్‌దే విజయమంటూ ప్రకటించింది. 

అవాంతరాలన్నీ తొలగిపోవడంతో జో బెడెన్ జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికార పీఠం వదిలిలేది లేదంటూ కల్లోలానికి కారణం అవుతున్న ట్రంప్‌కు ఈ పరిణామంతో భారీ షాక్ తగిలినట్టైంది. 

  క్యాపిటల్ భవనం వద్ద బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో వైట్‌హౌస్ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పదవులకు రాజీనామా చేశారు. వారి బాటలోనే మరికొందరు పయనించనున్నట్టు సమాచారం.

క్యాపిటల్‌ భవనంలో చెలరేగిన హింసాత్మక ఘటనల తర్వాత వాషింగ్టన్‌ డిసిలో తొలుత కర్ఫ్యూ విధించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని మేయర్‌ మురియెల్‌ బౌజర్‌ ఆదేశాలు జారీ చేశారు. హింసాత్మక ఘటనలు జరగడంతో 15 రోజలు పాటు అత్యయిక స్థితిని విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు.