శాంతియుతంగా, క్ర‌మబ‌ద్ధంగా అధికార బ‌దిలీ జ‌ర‌గాలి – మోదీ  

అమెరికాలోని కాపిట‌ల్ హిల్‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ద్ద‌తుదారులు చేసిన దాడిని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఖండించారు. ఇలా చ‌ట్ట విరుద్ధ నిర‌స‌న‌ల‌తో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను అడ్డుకునే చ‌ర్య‌ల‌ను స‌హించ‌కూడ‌ద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. “వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన దాడుల వార్త‌లు చూసి చాలా బాధ క‌లిగింది. శాంతియుతంగా, క్ర‌మబ‌ద్ధంగా అధికార బ‌దిలీ జ‌ర‌గాలి. ఇలాంటి చ‌ట్ట‌విరుద్ధ నిర‌స‌న‌ల‌తో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను అడ్డుకునే చ‌ర్య‌ల‌ను స‌హించ‌కూడదు” అంటూ మోదీ ట్వీట్ చేశారు. 
 
న‌వంబ‌ర్ 3న జ‌రిగిన ఎన్నిక‌ల‌ను త‌మ నుంచి దొంగిలించార‌ని, త‌మ గ‌ళాలు వినాలంటూ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ద్ద‌తుదారులు కాపిట‌ల్ హిల్‌పై దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. . ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌పంచ నేత‌లు ఖండించారు.   క్యాపిట‌ల్ హిల్‌లో హింస‌కు దారి తీసే విధంగే ట్రంప్ రెచ్చ‌గొట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయని అంటూ సోష‌ల్ మీడియా సంస్థ‌లు  ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించాయి. 
 
ఇది ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితి అని, అవ‌స‌ర‌మైన ఎమ‌ర్జెన్సీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, అధ్య‌క్షుడు ట్రంప్ వీడియోను కూడా డిలీట్ చేస్తున్న‌ట్లు ఫేస్‌బుక్ అధ్య‌క్షుడు గ‌య్ రోస‌న్ తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్ స‌ర్వీసును కూడా నిలిపివేశారు. ట్రంప్ చేసిన మెసేజ్‌లు హింస‌ను ప్రేరేపిస్తున్న‌ట్లు ఇన్‌స్టా ఆరోపించింది. ఫేస్‌బుక్‌ త‌న లేబుల్‌లో కూడా మార్పు చేసింది. 
అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారుచేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరును సొంతపార్టీ నేతలతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా అధికార మార్పిడి జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యవహారశైలి కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని, అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించేందుకు కేబినెట్‌ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహా మంత్రిమండలి సిద్ధమైనట్లు అమెరికా మీడియా పేర్కొంది.