జమ్మూ-కశ్మీరుకు రూ.28,400 కోట్ల ప్యాకేజీ

జమ్మూ-కశ్మీరు పారిశ్రామికాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.28,400 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. తయారీ రంగంతోపాటు సేవా రంగంలో కూడా ఈ ప్రాంతవాసులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ ప్యాకేజీని రూపొందించింది. 

జమ్మూలోని కన్వెన్షన్ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ ఈ వివరాలను తెలిపారు.  జమ్మూ-కశ్మీరు ప్రాంత ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ఆమోదించిందని సిన్హా చెప్పారు.

ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు, యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు  రూ.28,400 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించిందని తెలిపారు. దీంతో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్లలో యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ పథకం వల్ల సాంఘిక, ఆర్థిక అభివృద్ధి, నైపుణ్యం, సుస్థిర అభివృద్ధి  సాధ్యమవుతాయని చెప్పారు. ఈ పథకాన్ని ఆమోదించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ఈ నూతన పారిశ్రామికాభివృద్ధి పథకం స్థానిక తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని, జమ్మూ-కశ్మీరు స్వయం సమృద్ధం అవుతుందని తెలిపారు. ఈ పథకం వల్ల నూతన పెట్టుబడులు వస్తాయని, స్థానిక పరిశ్రమలను విస్తరించవచ్చునని చెప్పారు. జమ్మూ-కశ్మీరుతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన పెట్టుబడిదారుల వ్యాపార ప్రణాళికల అమలుకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఈ పథకం వల్ల ఏర్పడుతుందని చెప్పారు. 

పారదర్శక విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పెట్టుబడులు, మార్కెట్‌‌ను దృష్టిలో ఉంచుకుని విధానాల రూపకల్పన, నైపుణ్యంగల యువత వంటివన్నీ జమ్మూ-కశ్మీరులో ఉన్నాయని, జమ్మూ-కశ్మీరు ప్రస్తుత దశాబ్దంలోనే మన దేశానికి ప్రగతి కేంద్రంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.