భద్రతా మండలిలో  మూడు కీలక కమిటీలకు భారత్ నేతృత్వం 

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శుక్రవారం భారత దేశానికి కీలక బాధ్యతలు అప్పగించింది. 2021-22 కాలానికి నాన్ పర్మనెంట్ మెంబర్‌గా భద్రతా మండలిలో చేరిన మన దేశానికి మూడు ముఖ్యమైన కమిటీలకు నాయకత్వం వహించే అవకాశం ఇచ్చింది. ఐక్యరాజ్య సమితికి భారత దేశ రాయబారి టీఎస్ తిరుమూర్తి ఈ వివరాలను వెల్లడించారు.

తిరుమూర్తి విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడుతూ, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో ముఖ్యమైన అనుబంధ వ్యవస్థలకు నాయకత్వం వహించాలని భారత దేశాన్ని కోరినట్లు తెలిపారు. తాలిబన్‌పై ఆంక్షల కమిటీ, కౌంటర్ టెర్రరిజం కమిటీ, లిబియాపై ఆంక్షల కమిటీలకు మన దేశం నేతృత్వం వహిస్తుందని పేర్కొన్నారు. 

తాలిబన్‌పై ఆంక్షల కమిటీని 1988 శాంక్షన్స్ కమిటీ అని కూడా అంటారు. ఆఫ్ఘనిస్థాన్‌లో అభివృద్ధి, ప్రశాంతత, భద్రతల పట్ల భారత దేశానికి బలమైన ఆసక్తి, నిబద్ధత ఉండటం వల్ల తాలిబన్‌పై ఆంక్షల కమిటీకి నేతృత్వం వహించే అవకాశం రావడం చాలా ముఖ్యమైనదని చెప్పారు.  

ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాదులు, వారి స్పాన్సర్లపై దృష్టి పెట్టడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. శాంతి ప్రక్రియ, హింస ఏక కాలంలో సాధ్యం కాదనేది భారత దేశ దృక్పథమని తెలిపారు. పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కౌంటర్ టెర్రరిజం కమిటీకి మన దేశం 2022లో అధ్యక్షత వహిస్తుంది. న్యూయార్క్‌లో జరిగిన 9/11 ఉగ్రవాద దాడి అనంతరం ఈ కమిటీని ఏర్పాటు చేశారని, దీనికి గతంలో కూడా మన దేశం సారథ్యంవహించిందని తిరుమూర్తి చెప్పారు. 

ఆయుధాలపై నిషేధం, ఆస్తుల స్తంభన, ప్రయాణాలపై నిషేధం, చట్టవిరుద్ధంగా పెట్రోలియం ఎగుమతుల నిరోధం వంటి చర్యలపై లిబియా శాంక్షన్స్ కమిటీ చర్యలు రూపొందిస్తుందని వివరించారు.