సీఎం కేసీఆర్‌ బంధువుల కిడ్నాప్‌!

కేసీఆర్ ఏలుబడిలో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల భూ ఆక్రమణలు, వివాదాలు అంతులేకుండా పోతున్నాయి. రాజకీయంగా పలుకుబడి గలవారు అడ్డదిడ్డంగా భూములను ఆక్రమించుకొంటున్నారు. భూవివాదాలు శాంతిభద్రతల సమస్యలకు కూడా దారితీస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సమీప బంధువులని అపహరించిన సంఘటన కలకలం రేపుతున్నది. 

బోయినపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో  బీఎ్‌సఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో నివాసముండే ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు సోదరులు  సిఎం కేసీఆర్‌ సోదరి తరఫు సమీప బంధువులు. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. గత రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ దాడుల పేరుతో ప్రవీణ్‌ రావు ఇంట్లోకి చొచ్చుకువచ్చారు. 

మరికొందరు మాస్కులు ధరించి ఇంటి వాచ్‌మెన్‌పై దాడి చేశారు. ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను మూడు కార్లలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. వారితో పాటు ల్యాప్‌టాప్‌, మూడు సెల్‌ఫోన్లను కూడా పట్టుకెళ్లారు. ఈ ముగ్గురిని కిడ్నాప్‌ చేయడానికి హఫీజ్‌పేటలోని రూ.కోట్ల విలువైన భూ వివాదమే కారణమని తెలుస్తోంది. 

ఆ కోణంలో నార్త్‌జోన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీడియాను అనుమతించకుండా ఇంటి గేట్లకు పోలీసులు ముసుగు వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కిడ్నాపర్లలో ఒకరు ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ మనుషులమని చెప్పినట్లు తెలిసింది. 

8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అందులో భార్గవరామ్‌ సోదరుడు చంద్రహాస్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సిసి కెమెరాల ఆధారంగా డైమండ్ పాయింట్ నుంచి రాణిగంజ్ మీదుగా రెండు వాహనాలు వెళ్లినట్టు గుర్తించారు. కిడ్నాప్ గురైన వారిని సురక్షితంగా పోలీసులు ఇంటికి తీసుకొచ్చారు.

 ఘటనా స్థలాన్ని క్రీడా శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ పరిశీలించి  ఈ కిడ్నాప్‌ ఎవరు చేశారో అర్థమవుతోందన్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నగరమంతా గాలిస్తున్నారని, కేసును త్వరలోనే ఛేదిస్తారని చెప్పారు. హఫీజ్‌పేట భూ వివాదమే ఈ ఘటనకు కారణమా అని అడిగితే.. అది కూడా త్వరలోనే తేలుతుందని బదులిచ్చారు. ఇటీవల ప్రవీణ్‌రావు సోదరుల గృహ ప్రవేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా హాజరైనట్లు తెలిసింది.