హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు 

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందువుల విశ్వాసాలకు విఘాతం కలిగేలా ఈ దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.  ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదని హితవు హెచ్చరించారు. 
 
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో 128 సంఘటనలు జరిగితే, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అన్న అనుమానం కలుగుతోందని విస్మయం వ్యక్తం చేశారు. రామతీర్థం కొండపై రాముని విగ్రహం ధ్వంసమైన ఘటనలో తనని బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం చైర్మన్‌ పదవి నుంచి తప్పించిందని విచారం వ్యక్తం చేశారు.

దేవాలయాల ఆదాయాల్లో కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌), అదేవిధంగా ఎండోమెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫండ్‌ (ఈఏఎఫ్‌) కింద 17శాతం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని, ఆ నిధులతోనే దేవాలయాల భద్రతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియోలో ‘‘రాష్ట్రంలో భౌతిక, శాసన, పాలనాపరమైన మూడు రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. అసెంబ్లీలో బిల్లు నెంబరు 2/2020 ద్వారా భారీ ఆదాయాలున్న టీటీడీ సహా 9 ఆలయాల ట్రస్టీలపై పర్యవేక్షణను తొలగించారు. దీంతో ఆయా ట్రస్టీల్లో ఎవరు ఏం చేస్తున్నారు?” అంటూ ప్రశ్నించారు. 

 జైల్లో ఉన్నవారు, బెయిల్‌పై ఉన్నవారిని ఆలయాలకు చైర్మన్‌లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు. ఇక, సింహాచలం భూముల్లో 500 ఎకరాలు తీసుకుని, వేరే చోట ఇస్తారట. ఇక్కడి భూములకు అక్కడి భూములకు తేడా ఏంటి? అనేది ఎవరికీ చెప్పరని దుయ్యబట్టారు. 

ఇదంతా లూటీగా కనిపిస్తున్నదని అశోకగజపతిరాజు విమర్శించారు. దేవదాయ మంత్రి నోటి నుంచి బూతులు తప్ప మంచి మాటలు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు.  ఆలయాల ఆస్తులను దోచేయాలని క్రమపద్ధతిలో వ్యవహరిస్తున్నవారికి ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పాలని మాజీ కేంద్ర మంత్రి పిలుపిచ్చారు.