
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నిఘావిభాగం అధిపతిగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావును అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎటువంటి పోస్ట్, కనీసం జీతం కూడా ఇవ్వకుండా వేధిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు హయాంలో జరిపిన భద్రతా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి వెంకటేశ్వరరావు అరెస్టు తధ్యం అనే కధనాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో తొలుత అభియోగాల నమోదు చేయకుండానే ఆయన్ను సస్పెండ్ చేసిన జగన్ సర్కార్ కోర్టు అభ్యంతరాలతో తాజాగా ఆ ప్రక్రియను పూర్తి చేసింది.
హైకోర్టు పలు సార్లు ఆదేశించినా ఇప్పటికీ ఆయనకు పోస్టింగ్, జీతం ఇవ్వలేదు. ఈ కేసులో తనను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు గ్రహించిన ఏబీని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును, తనను వేధిస్తోందంటూ ఐపీఎస్ అధికారుల సంఘాన్ని ఆశ్రయించారు.
అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వ అండదండలతో ఈ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరించిన ఏబీని ప్రతిపక్ష నేతగా ఉండగానే జగన్ లక్ష్యంగా చేసుకొని పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసి, ఆయనను నిఘా విభాగం నుండి బదిలీ అయ్యేటట్లు చేశారు.
భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాల కేసులో సస్పెండ్ చేయడమే కూడా జీతభత్యాలను సైతం ఆపేశారు. దీంతో ఆయన క్యాట్‌తో పాటు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఊరట పొందారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అభియోగాలను నమోదు చేసిన ప్రభుత్వం వీటిపై ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తి కరంగా లేదనే కారణంతో అరెస్టుకు సిద్దమవుతోంది.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో తనను ఇరికించిందని, తాను చేయని తప్పులకు బలి చేయాలని చూస్తోందని, అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైకోర్టులో ఊరట లభించకపోతే సుప్రీంను ఆశ్రయించేందుకు ఏబీ సిద్దమవుతున్నారు.
మరోవంక, జగన్ ప్రభుత్వం తనను వేదింపులకు గురి చేస్తోందంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారుల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. ఇంటిలిజెన్స్ ఛీఫ్ హోదాలో పని చేసిన తనను ప్రభుత్వం అన్ని రకాలుగా వేధిస్తోందంటూ ఐపీఎస్ అధికారుల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
త్వరలో క్రిమినల్ కేసుపెట్టి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపి, మళ్లీ సస్పెన్షన్ విధించాలని కుట్ర ప్రభుత్వం పన్నుతోందంటూ ఆయన ఈ లేఖలో ఆరోపించారు. ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే నెలల తరబడి తనను ఉద్యోగం చేయనీయకుండా, జీతం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఏబీ ఆరోపించారు. వెంటనే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని విషయాలను ఆధారాలతో సహా వివరిస్తానని, నిష్పక్షపాత విచారణ జరగాలన్నది తన డిమాండ్ అని వెంకటేశ్వరరావు ఆ లేఖలో తెలిపారు.
More Stories
లోకేష్ సిఐడి విచారణ 10కి వాయిదా
చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు