చిన్నజీయర్ స్వామి దాడికి గురైన ఆలయాల యాత్ర

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న వరుస ఘటనలనపై  త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ఆందోళన వ్యక్తం చేస్తూ  ఏపీ ఆలయాల్లో విగ్రహాలకు ఏమాత్రం రక్షణ లేదని, రక్షణ పూర్తిగా కొరవడిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తాడేపల్లిలోని విజయకీలాద్రిపై చినజీయర్ స్వామీజీ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ధనుర్మాసం పూర్తికాగానే ఓ క్రమంలో ఏయే ఆలయాలపై దాడులు జరిగాయో వాటన్నింటినీ సందర్శిస్తామని ఆయన ప్రకటించారు.  నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్రను చేపట్టనున్నట్లు చినజీయర్ ప్రకటించారు. 
 
అయితే ఏ ప్రాంతం నుంచి యాత్ర చేపట్టాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని, త్వరలోనే నిర్ణయించుకుంటామని చెప్పారు. యాత్రపై పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ యాత్ర కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 
 
దేవాలయం స్థానంలో చర్చి కానీ, మసీదు కానీ ఉంటే ప్రపంచం మొత్తం కదిలేదని, ఆలయాలను ఆసరాగా చేసుకొని జీవించే వారు శాంతియుతంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. యాబైకి పైగా విగ్రహాలపై దాడులు జరిగాయని అధికారింగానే తెలుస్తోందని, స్థానికంగా ఉన్న వారికి ఎలాంటి భయాందోళనలు కలగకుండా నైతిక మద్దతివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.
 
దెబ్బతిన్న ఆలయాలు, ధ్వంసమైన విగ్రహాలను  పరిశీలించిన తర్వాత ఏం చేస్తే బాగుటుందనే దానిపై పెద్దలతో చర్చించి  ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.  ఆలయాల రక్షణ విషయంలో స్థానికులకు కలిగే భయాందోళనలపై అందరికీ ధైర్యం చెప్పాల్సిన అవసరముందని పేర్కొన్నారు.  
 
ఆయా ప్రాంతాల్లో స్థానికులను కలిసి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆలయాల ఉనికికే భంగం కలిగే పరిస్థితి వచ్చినపుడు మౌనంగా ఉండకూడదనే తాము బయటకు వస్తున్నట్లు వివరించారు.   ఎవరు ఎలాంటి తప్పు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 
 
చర్చి, మసీదులపైనా దాడులు జరిగినా తీవ్రంగా స్పందించాలని కోరారు. మతపరమైన అంశాలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని  హితవు చెప్పారు. ఇలాంటి దాడులు నివారించడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేయాలని స్వామీజీ సూచించారు.  ఏ దేవాలయాల్లోనూ సీసీ కెమెరాలు పెట్టలేదని, రామతీర్థంలో విగ్రహ విధ్వంసం తరువాత సీసీ కెమెరాలు పెట్టారని గుర్తు చేశారు. దేవాలయాలకు రక్షణ వ్యవస్థ కల్పించాలని అవసరం ఉందని సూచించారు.