రామతీర్థ ఘటనపై అమిత్ షా, పవన్ ఆగ్రహం 

బిజెపి, జనసేనలు చేపట్టిన రామతీర్థ పర్యటనను పోలీసులు అడ్డుకోవడం పట్ల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి  ఫోన్ చేసి రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రామతీర్థం ఘటనపై అమిత్‌షా ఆరా తీశారు.
రామతీర్థ ధర్మయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. రామతీర్థం సందర్శనకు వెళ్తే సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు.  వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రామతీర్థం చేరుకోని నిరసన తెలిపామని చెప్పారు. 
 
నిరసన తెలిపే హక్కును సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం హరించి వేస్తోందని పవన్‌ విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం దోషులను పట్టుకోని కఠినంగా శిక్షించాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు.   
మరోవైపు సోమువీర్రాజు నేతృత్వంలో జనసేన కార్యకర్తలతో కలిసి ఈ రోజు రామతీర్థం సందర్శనకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.  ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిరంకుశ విధానాలకు ఇది పరాకాష్టగా నిలిచిందని చెప్పారు.
రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్యమత ప్రచారం పెరిగిపోయిందని పేర్కొంటూ దీనిలో భాగంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆలయాల దాడి ఘటనలపై వైసీపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలు అనుసరిస్తోందని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.
కంటితుడుపు చర్యగా మాత్రమే  వైసీపీ సర్కారు స్పందించిందని, దోషులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తోందని దయ్యబట్టారు. ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు.  వైసీపీ  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు.