రామతీర్థంలో తోపులాటలో కిందపడ్డ సోమువీర్రాజు

బీజేపీ, జనసేన నేతలు చేపట్టిన ‘రామతీర్థం ధర్మయాత్ర’ ఉద్రిక్తతకు దారి తీసింది. రామతీర్థంకు చేరుకుంటున్న బీజేపీ, జనసేన నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన, బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

తోపులాటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కిందపడిపోయారు. రామతీర్థంకు వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లడుతూ విగ్రహాల ధ్వంసం విషయంలో సీఎం జగన్, మంత్రుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. 

 రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని, నియంతృత్వ పోకడలకు పోతున్నారని మండిపడ్డారు. రామతీర్థంలో పోలీసులు సెక్షన్30 అమలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటన నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డికి ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.

 రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించడం జగన్ ప్రభుత్వం చేతగాని, పిరికి తనానికి నిదర్శనమని వీర్రాజు దయ్యబట్టారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డిలకు రామతీర్థంకు అనుమతి ఇచ్చి.. మమ్మల్ని అడ్డుకోవడం అంటే రాష్ట్రంలో హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఉందని, దీన్ని ప్రభుత్వం పనికిమాలిన, పిరికి చర్యగా భావిస్తున్నానని ధ్వజమెత్తారు. 

‘‘జగన్‌…నిన్ను సీఎం కుర్చీ నుంచి దించే వరకు మేము నిద్రపోము’’ అంటూ సోమువీర్రాజు శపథం చేశారు. దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉంటే జగన్‌‌ ఏం చేశారంటూ తీవ్రమైన పదజాలంతో  వ్యాఖ్యలు చేశారు. సోమువీర్రాజును పోలీసులు వలయంగా చుట్టుముట్టారు.

అయితే ఎట్టిపరిస్థితుల్లో కూడా తాము రామతీర్థం చేరుకుని తీరుతామని సోమువీర్రాజు స్పష్టం చేశారు. మునుపెన్నుడూ లేని విధంగా సోమువీర్రాజు దూకుడు ప్రదర్శించిన తీరు పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.  బీజేపీ, జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

మరోవైపు రామతీర్థం ధర్మయాత్రకు వచ్చిన పిఠాపురం, ఏలూరు, విజయవాడ, నెల్లూరు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లే రహదారి అంతా ట్రాఫిక్‌తో స్తంభించింది. ఇంకో వంక, రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బిజెపి నాయకులను వారి ఇళ్ల వద్దనే  రామతీర్ధకు  అడ్డుకున్నారు

పోలీసుల తీరును తాను తప్పు పట్టడంలేదని, అధికారులు ఎలా చెబితే వాళ్లు అలా నడుచుకుంటారని బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు  విమర్శించారు.   చేతిలో అధికారం ఉందని ఇష్టమోచ్చినట్లు ప్రవర్తించడం సరికాదని, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదని హెచ్చరించారు. 

రామతీర్థంకు వెళ్లవద్దంటే వెళ్లమని, తాము శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పనులు చేయమని పేర్కొన్నారు. కానీ నిరసన తెలిపే హక్కుందని స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యాలయానికి వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని, తమ పార్టీ ఆఫీసుకు వస్తుంటే వద్దనడానికి ఎవరికీ హక్కులేదని కామినేని తేల్చి చెప్పారు.