భాగ్యనగరి నుంచే కొవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరా

భాగ్యనగరి నుంచే కొవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరా

భారతదేశం నుంచి వ్యాక్సిన్ ఎగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ఎప్పుడూ ఒక ముఖద్వారంగా ఉంటూ వచ్చిందని జిఎంఆర్ సిఇఒ ప్రదీప్ పణికర్ తెలిపారు. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్లను సురక్షితంగా, సమర్థవంతంగా రవాణా చేయడానికి ఖచ్చితమైన ప్రణాళిక, సహకారాలు అవసరమని పేర్కొన్నారు. 

అందుకే కోవిడ్ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడంకోసం తాము దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్, జిఎంఆర్‌హైదరాబాద్ ఎయిర్ కార్గో, దుబా య్ విమానాశ్రయాలు కలిసి హైదరాబాద్ -దుబాయ్ గ్లోబల్ వ్యాక్సిన్ కారిడార్ అనే ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఎయిర్ ఫ్లైట్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ ఒప్పందంపై సోమవారం జిఎంఆర్ సిఇఒ ప్రదీప్ పణికర్ సౌరభ్ కుమార్, హైదరాబాద్ ఎయిర్ కార్గో సిఇఒ యూజీన్ బారీ, దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ ఇపి విలు కలిసి వర్చువల్ కార్యక్రమంలో సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా జిఎంఆర్ గ్రూప్ ఇడి, ఛీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ల రవాణాకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ ఎయిర్ పోర్ట్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్, వ్యాక్సిన్ల రవాణా ఎలాంటి ఆటంకాలూ లేకుండా జరగడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. 

దుబాయ్ విమానాశ్రయాల సిఇఒ పాల్ గ్రిఫిత్స్ మాట్లాడుతూ, రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్లను సమర్థవంతంగా, సురక్షితంగా పంపిణీ చేయడానికి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఆ డిమాండ్‌కు తగినట్లు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండాలని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు.

వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో చివరి దశలోకి ప్రవేశించిన నేపథ్యం లో జిఎంఆర్ హైదరాబాద్‌తో తమ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. జిఎంఆర్ హైదరాబాద్ అనేక ప్రధాన వ్యాక్సిన్ తయారీదారులకు సమీపంలో ఉంది. యూరప్, ఆఫ్రికా, అమెరికా, ఆసియాలోని మార్కెట్లను లక్ష్యంగా చేసుకొన్న వ్యాక్సిన్ల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా ఉంది.

టెంపరేచర్ సెన్సిటివ్ వ్యాక్సిన్ కార్గోను నిర్వహించే హైదరాబాద్ విమానాశ్రయం, దుబాయ్ విమానాశ్రయంలాంటి ప్రధాన హబ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాటిని పంపి ణీచేస్తుంది. జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ఫార్మా, వ్యాక్సిన్ రవాణాలో డబ్లూహెచ్‌ఒ జిఎస్‌డిపి (ప్రపంచ ఆరోగ్య సంస్థ- మంచి నిల్వ, పంపిణీ పద్ధతులు) గుర్తింపు పొందిన సర్టిఫైడ్ కార్గో విమానాశ్రయం.

ఇది భారతదేశం యొక్క మొదటి డెడికేటెడ్ ఫార్మా జోన్, అతి పెద్ద టన్నెల్ ఎక్స్-రే మెషిన్ మరియు కోవిడ్ వ్యాక్సిన్ల సురక్షిత రవాణాకు కీలకమైన ఎన్విరోటైనర్, వా-క్యూ-టెక్, సీసేఫ్, డోకాస్చ్ వంటి వివిధ కూల్ కంటైనర్ల ప్రధాన స్టాకింగ్ స్టేషన్లలో ఒకటి. 

కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల నిర్వహణలో ప్రత్యేకమైన అవసరాల కోసం జిఎంఆర్ హైదరాబాద్ ల్యాండ్‌సైడ్, ఎయిర్‌సైడ్ సదుపాయాలను పెంచి, వాటి ని ఒక క్రమంలో నిర్వహించే ప్రక్రియలను చేపడుతోంది. జిఎంఆర్ హైదరాబాద్ ఇప్పటికే ఒక పెద్ద, ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా తయారుచేయించిన కూల్ డాలీ ని ప్రారంభించింది. ఇది ఎయిర్ సైడ్ రవాణాలో విమానాన్ని ఎక్కించేంతవరకు ఆటంకాలు లేకుండా వ్యాక్సిన్లు లేదా ఇతర సరుకుల కోల్డ్-చైన్‌ను కొనసాగిస్తుంది.