ఔరంగాబాద్‌ పేరు మార్పుపై శివసేన, కాంగ్రెస్ రగడ 

మహరాష్ట్రలోని చారిత్రక నగరం ఔరంగాబాద్‌ పేరును మహారాష్ట్ర యుద్ధవీరుడు, రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ పేరుతో శంభాజీ నగర్ గా మార్చాలనే ప్రతిపాదన అక్కడ అధికారంలో భాగస్వాములైన శివసేన, కాంగ్రెస్ ల మధ్య తాజా వేయడానికి కారణం అవుతున్నది.  గత మూడు దశాబ్ధాలుగా తమ ప్రచారంలో ఒక భాగంగా ఉన్న ఔరంగాబాద్‌ పేరు మార్పు విషయంలో శివసేన ముందుకు వెళ్లేందుకు చూస్తోండగా, అందుకు కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోంది. 

నిజాంషాహీ రాజవంశస్తుడైన మాలిక్ అంబర్ ఈ నగరాన్ని 1610లో నిర్మించారు. ఆ తర్వాత ముఘల్ రాజు జురాంగ్జీబ్ ఈ నగరాన్ని తన రాజధానిగా చేసుకొని, ఇక్కడని మృతి చెందాడు. ఆ కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన శంభాజీ మహాజర్ ను బంధించి, ఇక్కడనే ఉంచి చిత్రహింసలకు గురిచేసి, దారుణంగా చంపాడు.

1980వ దశకంలో ముంబై, థానే లను దాటి తమ  విస్తరించుకొంటూ వస్తున్న శివసేన 1988 ఎన్నికలలో ఔరంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో విజయం సాధించింది. ఆ సంవత్సరం మే 8న జరిగిన విజయోత్సవ ర్యాలీలో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే పాల్గొంటూ ఈ నగరాన్ని “శంభాజీ నగర్”గా పేరు మారుస్తున్నట్లు ప్రకటించారు.  అప్పటి నుండి ఈ అంశం రాజకీయంగా వేడి పుట్టిస్తున్నది. 

1995లో ఈ నగరం పేరును “శంభాజీ నగర్” గా మారుస్తూ పురపాలక సంఘం తీర్మానం ఆమోదించింది. ఈ విషయమై ప్రజాభిప్రాయం కోరుతూ  మనోహర్ జోషి నేతృత్వంలోని శివసేన – బిజెపి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ ముస్తాక్ అహ్మద్ హై కోర్ట్ కు వెళ్లగా, అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అంటూ కొట్టివేసింది. 

ప్రస్తుతం ఎన్సీపీలో ఉన్న అహ్మద్ ఆ తర్వాత హై కోర్ట్ నిర్ణయంపై సుప్రీం కోర్ట్ కు వెళ్లి స్టే పొందారు. ఇంతలో 1999లో అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ – ఎన్సీపీ ప్రభుత్వం ఆ ప్రకటనను ఉపసంహరించుకొంది. ఇలా ఉండగా, గత మార్చ్ లో అహ్మదాబాద్ విమానాశ్రయం పేరును శంభాజీ విమానాశ్రయంగా మార్చాలని గత మార్చ్ లో ఉద్ధవ్ థాకరే మంత్రివర్గం తీర్మానం చేసింది. అయితే ఈ విషయమై  ఇంకా కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. 

కాగా, ఔరంగాబాద్ నగరం పేరును మార్చే ప్రతిపాదనను తమ పార్టీ ఖచ్చితంగా గట్టిగా వ్యతిరేకిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు బాలాసాహెబ్‌ థోరట్‌ ఇటీవల స్పష్టం చేశారు. ఇది తమ సాధారణ కనీస కార్యక్రమం (కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌) కింద లేదని, పేర్ల మార్పులో తమ పార్టీకి నమ్మకం లేదని పేర్కొన్నారు. పేర్ల మార్పు వలన సాధారణ వ్యక్తికి ఎటువంటి ఉపయోగం లేదని, అభివృద్ధి రాదని కొట్టిపారవేసారు. 

అయితే, మహావికాస్‌ ఆఘాడి పక్షాలతో చర్చల అనంతరం ఈ సమస్యకుకు పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నట్లు శివసేన పేర్కొంది. దీనిపై శివసేన సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపి సంజరు రౌత్‌ మాట్లాడుతూ ‘ నగర పేరు మార్పు డిమాండ్‌ను బాలాసాహెబ్‌ థాకరే చేశారు. ఔరంగాబాద్‌ పేరును ఆయన శంభాజీనగర్‌గా మార్చారు. దీనికి సంబంధించి ఇక పేపర్‌ వర్క్‌ మాత్రమే మిలిగి ఉంది’ అని ప్రకటించారు. 

ఈ విషయంలో మహావికాస్‌ ఆఘాడి పార్టీల మధ్య ఎటువంటి చీలిక లేదని, కలసి కూర్చొని దీన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. పేరు మార్చడంపై కాంగ్రెస్‌ వ్యతిరేకత కొత్తది కాదని, దీనిపై సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయని బిజెపి మరోవంక ఎద్దేవా చేస్తున్నది. ఇంకోవైపు పేరు మార్పును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరాఠా కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఔరంగాబాద్‌లో ఆందోళన చేపట్టారు.

“ఈ నగరం పేరు మార్చడం మాకు రాజకీయ అంశం కాదు. విశ్వాసానికి సంబంధించినది. ఈ విషయమై శివసేన, కాంగ్రెస్ ల మధ్య నెలకొన్న వివాదంతో మాకు సంబంధం లేదు. బాలాసాహెబ్ చేసిన ఈ డిమాండ్ కు మద్దతుగా నిలబడవలసి బాధ్యత శివసేనదే” అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. 

2011 జనాభా లెక్కల సేకరణ ప్రకారం 11.75 లక్షల మంది జనాభా ఉన్న ఔరంగాబాద్ నగరంలో 51 శాతం మంది హిందువులు, 31.8 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికలలో నాలుగు సార్లు గెలుపొందిన శివసేన అభ్యర్థి చంద్రకాంత్ ఖైరే ను ఓడించి ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ గెలుపొందారు. దానితో ఈ ప్రాంతంపై తమ  పట్టు నిలుపుకోవడం కోసం నగరం పేరు మార్చడం శివసేన కు సవాల్ గా మారింది.