చైనా టెక్ బిలియనీర్, ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం ‘అలీబాబా’ వ్యవస్థాపకుడు జాక్ మా అదృశ్యమయ్యాడు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ నేతృత్వంలోని సెంట్రల్ కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ప్రభుత్వంతో ఘర్షణకు దిగిన ఆయన గత రెండు నెలల నుంచి ఎవరికీ కనిపించకుండా పోయాడు.
ఆసియా ఖండంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన జాక్ మా దాదాపు రెండు నెలల క్రితం చైనా పాలకులకు సలహాలు ఇవ్వబోయి వారి ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జాక్ మా అదృశ్యం కావడం అనేక అనుమాలను రేపుతున్నది.
‘ఆఫ్రికాస్ బిజినెస్ హీరోస్’ పేరిట సొంతగా ఓ టాలెంట్ షోను నిర్వహిస్తున్న జాక్ మా నవంబర్‌లో ఆ షో చివరి ఎపిసోడ్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించాల్సి ఉన్నది. కానీ ఆ కార్యక్రమానికి జాక్ మా హాజరు కాలేదు. ఆయన స్థానంలో అలీబాబా ఎగిజక్యూటివ్ ఒకరు ఆ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
దీంతో ఆ టాలెంట్ షో వెబ్‌సైట్ నుంచి జాక్ మా ఫొటోలను తొలగించినట్లు బ్రిటన్‌కు చెందిన ‘టెలిగ్రాఫ్’ పత్రిక వెల్లడించింది. జిన్‌పింగ్ సర్కార్‌పై బాహాటంగా విమర్శలు గుప్పించే చైనా వ్యాపారవేత్తల్లో జాక్ మా ఒకరు.
దేశ వాణిజ్య రాజధాని షాంఘైలో గతేడాది అక్టోబర్ 24న జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా ప్రసంగిస్తూ.. చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను తీవ్రంగా ఎండగట్టారు. చైనా ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ‘తాకట్టు దుకాణాల’ మాదిరిగా వ్యవహరిస్తున్నాయని, ఆ మనస్తత్వాన్ని వీడి విస్తృత దృక్పథంతో ఆలోచించాలని హితవు పలికారు.
దీంతో జాక్ మాపై కన్నెర్రజేసిన జిన్‌పింగ్ సర్కార్ ఆయనపై ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. జాక్ మా వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో అడుగడుగునా నిఘా పెట్టింది. అంతేకాకుండా నవంబర్‌లో జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)ను అడ్డుకున్నది. దీంతో అలీబాబా గ్రూప్ సంపదతోపాటు జాక్ మా ఆస్తులు కరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జాక్ మా అదృశ్యం కావడం సంచలనం రేపుతున్నది.
More Stories
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!