లండన్ కోర్టులో అసాంజేకి పెద్ద ఊరట 

వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అమెరికాకు తరలించడం కుదరదని యూకేలోని ఓ కోర్టు తేల్చిచెప్పింది. అసాంజే ‘‘మానసిక ఆరోగ్య పరిస్థితి బాగోనందున’’ ఆయను అప్పగించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.  అసాంజెను అమెరికాకు అప్పగిస్తే ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని జిల్లా జడ్జి వెనెస్సా బరేట్సర్ అభిప్రాయపడ్డారు. 

దీనిపై ఏడాది పాటు విచారణ జరిపిన అనంతరం ఓల్డ్ బెయిలీలోని సెంట్రల్ క్రిమినల్ కోర్టు బెంచ్ న్యాయమూర్తి వెనెస్సా బారిటెసర్ ఈ తీర్పు వెలువరించారు. దీనిపై మానవ హక్కుల కార్యకర్తలు, అసాంజే మద్దతుదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.  అసాంజేకి సంఘీభావం తెలుపుతూ కొద్ది వారాలుగా ఆయన మద్దతుదారులు లండన్‌లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 49 ఏళ్ల అసాంజేను అమెరికాకు అప్పగిస్తే… మీడియా స్వేచ్ఛను ‘‘అణిచివేస్తున్న’’ అమెరికాతో బ్రిటన్ చేతులు కలిపినట్టేనని వారు వాదిస్తున్నారు.

కాగా. ఈ తీర్పుపై తాము పైకోర్టుకు అప్పీలుకు వెళతామని అమెరికా ప్రభుత్వం తెలిపింది. అసాంజెపై 17 గూఢచర్యం ఆరోపణలతోపాటు కంప్యూటర్ దుర్వినియోగం ద్వారం దశాబ్దం క్రితం తమ దేశ సైనిక, దౌత్యపరమైన పత్రాలను ప్రచురించారన్న ఆరోపణ ఉందని అమెరికా ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అభియోగాలు రుజవైతే అసాంజెకు గరిష్టంగా 175 ఏళ్ల జైలుశిక్ష పడుతుందన్నది అమెరికా వాదన. 

కాగా ఆస్ట్రేలియన్ పౌరుడైన అసాంజె తరఫు న్యాయవాదులు మాత్రం అసాంజె ఒక జర్నలిస్టుగా తన బాధ్యతలు నిర్వర్తించాడని, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సైన్యం పాల్పడిన అక్రమాలను వెలికితీసిన పత్రాలను ప్రచురించే స్వేచ్ఛ ఆయనకు ఉందని వాదించారు. 

అయితే అసాంజె తరఫు న్యాయవాదుల వాదనతో జడ్జి ఏకీభవించలేదు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛగా వీటిని పరిగణించలేమని, నేరారోపణలు రుజువైతే ఆయన శిక్షార్హుడేనని ఆమె స్పష్టం చేశారు. అయితే, అసాంజె మానసిక కుంగుబాటును ఎదుర్కొంటున్నారని, అమెరికా జైలులో ఆయన ఏకాంతంగా ఉంటే అది మరింత తీవ్ర పరిస్థితికి దారితీయగలదని జడ్జి అభిప్రాయపడ్డారు.   

2010-11 మధ్య ప్రభుత్వ కంప్యూటర్ల నుంచి దౌత్య వ్యవహారాలు, రహస్య సమాచారం చోరీలో అసాంజే ప్రమేయంపై విచారణ జరిపేందుకు ఆయనను తమకు అప్పగించాలంటూ అమెరికా కోరుతోంది.