రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణ  

రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో దేవాదాయ, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు.

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజా శంకర్, దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్లు, ఆర్ జేసీలు, డీసీలు హాజరయ్యారు. రామతీర్థం ఘటన తో పాటు దేవాలయాలపై జరుగుతున్న దాడులపై అధికారుల నుంచి వివరాలను అడిగి మంత్రి తెలుసుకున్నారు.  

రామతీర్థం రాముడు విగ్రహం పున:ప్రతిష్ఠపై చర్చించారు. అధికారులు, పండితుల అభిప్రాయాలను మంత్రి తీసుకున్నారు. నెల రోజుల్లో రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

చిన్న చిన్న దేవాలయాల్లోనూ కూడా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు, మెటల్ డోర్ డిటెక్టర్స్ తో తనిఖీలు, ఎస్పీఎఫ్‌ సిబ్బంది బందోబస్తు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.  ఇప్పటి వరకు జరిగిన దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. రామతీర్ధం ఆలయంలో జరిగిన ఘటన దురదృష్డకరమని, దీని వెనుక కుట్రకోణాలు కనిపిస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఇలా  ఉండగా, ‘‘దేవుడన్న భయం లేకుండా పోతోంది. దేవున్ని కూడా రాజకీయాలలోకి తీసుకొస్తున్నారు‌. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో గుళ్ళలో విగ్రహాలను ఎంచుకుని ధ్వంసం చేస్తుంటే, అక్కడ ప్రతిపక్షాలు ఆగడాలకు దిగుతున్నాయి. అలాంటి కేసులను కూడా సమర్థవంతంగా తేల్చగలగాలి” అంటూ ముఖ్యమంత్రి తిరుపతిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ ఉద్దేశించి మాట్లాడుతూ తెలిపారు. 

 
“దేవుడి విగ్రహాలు కూల్చితే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలకు పాల్పడుతున్నారో.. ప్రజలు ఆలోచన చేయాలి. ప్రభుత్వంలో ఏదైనా మంచి కార్యక్రం జరిగి పబ్లిసిటీ వస్తుందనే.. డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘటనలు చేస్తున్నారు” అంటూ  విమర్శించారు.