ఎన్నారైల‌కు పోస్టల్ బ్యాలెట్‌

పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవ‌కాశాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఎన్నారైల‌కు క‌ల్పించింది.  కేంద్ర విదేశాంగ శాఖ‌. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఎల‌క్ట్రానిక‌ల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్ట‌ల్ బ్యాలెట్ సిస్ట‌మ్ (ఈటీపీబీఎస్‌)తో ఎన్నారైలు ఓటు వేయ‌వ‌చ్చు. 

అయితే ఈ విధానాన్ని అమ‌లు చేసే ముందు అంద‌రు భాగ‌స్వాముల‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని ఎన్నిక‌ల సంఘానికి విదేశాంగ శాఖ సూచించింది. ఎన్నారైల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించేలా ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌వ‌ర్తనా నియ‌మావ‌ళి, 1961లో అవ‌స‌రమైన స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని గ‌తేడాది న‌వంబ‌ర్ 27న కేంద్రానికి ఎన్నిక‌ల సంఘం లేఖ రాసింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెల‌ల్లో అస్సాం, వెస్ట్ బెంగాల్‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చెరిల‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లోనే దీనిని అమ‌లు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు ఆ లేఖ‌లో ఎన్నిక‌ల సంఘం తెలిపింది. 

వివిధ కార‌ణాల వ‌ల్ల తాము ఓటు హ‌క్కును వినియోగించ‌లేక‌పోతున్నామ‌ని, అందుకే త‌మ‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యం క‌ల్పించాలంటూ త‌మ‌కు ఇప్ప‌టికే చాలా మంది ఎన్నారైల నుంచి అభ్య‌ర్థ‌న‌లు వస్తున్న‌ట్లు కూడా ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఈటీపీబీఎస్ సౌక‌ర్యం  సాయుధ బ‌ల‌గాల‌కు, పారామిలిటరీ బ‌ల‌గాలు, విదేశాల్లోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఉంది.