కాంట్రాక్ట్ వ్యవసాయంలోకి ప్రవేశించం : రిలయన్స్

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్ శక్తులు లాభపడతాయన్న విమర్శల నేపథ్యంలో రిలయన్స్ కంపెనీ సోమవారం స్పందించింది. కాంట్రాక్ట్ వ్యవసాయం లేదా కార్పొరేట్ వ్యవసాయంలోకి తాము ప్రవేశించబోమని స్పష్టం చేస్తూ రియలన్స్ కీలక ప్రకటన చేసింది. 
 
అంతేకాకుండా రైతుల నుంచి వ్యవసాయ భూములను కూడా కొనుగోలు చేసే ఆలోచనకు తమకు లేదని స్పష్టం చేసింది. సోమవారం ఈ మేరకు రిలయన్స్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో కూడా వీటిపై తమ దృష్టి నిలపమని రిలయన్స్ కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొంది. 
 
రైతుల నుంచి నేరుగా తాము పంటలను కొనుగోలు చేయమని, కేవలం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం మాత్రమే తమ సరఫరాదారులు కొనుగోలు చేస్తారని తెలిపింది. 
 తక్కువ ధరలకుండే ఏ దీర్ఘకాలిక సేకరణ ఒప్పందంలోకి తాము ప్రవేశించాలని భావించడం లేదని తెలిపింది.
 
 ‘‘రైతులు కష్టపడి పండించిన పంటలకు లాభదాయకమైన ధర లభించి, వారి కృషికి ప్రతిఫలం లభించాలన్నదే రియలన్స్, దాని సంబంధిత సంస్థల అభిమతం. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుకే కట్టుబడి ఉండాలని మా సరఫరాదారులనూ మేం కోరుతున్నాం.’’ అని రియలన్స్ పేర్కొంది. 
 
రైతుల నిరసన సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో చోటు చేసుకున్న సెల్ టవర్ల ధ్వంసం పై కూడా స్పందించింది. ఈ సెల్ టవర్ల విధ్వంసం వెనుక విదేశీ శక్తులతో పాటు వ్యాపార శత్రువులున్నట్లు తాము భావిస్తున్నామని రియలన్స్ పేర్కొంది.
కాగా, కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ అగ్రి చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేస్తున్న జియో మొబైల్ ట‌వ‌ర్ల విధ్వంసాన్ని వెంట‌నే ఆపాలంటూ రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్   పంజాబ్ , హ‌ర్యానా కోర్టులను ఆశ్ర‌యించనుంది. గ‌త కొన్ని వారాలుగా జియో ప్రోప‌ర్టీస్ మీద జ‌రుగుతున్న విధ్వంసంపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణం జోక్యం చేసుకోవాల‌ని పంజాబ్, హర్యానా హైకోర్టులో రిలయెన్సు జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ద్వారా పిటిషన్ దాఖలు చేయనుంది.

విధ్వంసక చ‌ర్య‌ల వల్ల  ఆ రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న‌ త‌మ సంస్థ‌లలో ప‌ని చేసే వేలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడవేసిన‌ట్ట‌యింద‌ని పిటిష‌న్‌లో పేర్కొంది. రైతు చ‌ట్టాల‌పై, రిల‌య‌న్స్ సంస్థ‌ల‌పై తీవ్ర కోపంతో ఉన్న ‌ రైతులు గ‌త‌ కొన్ని వారాలుగా రోజుకి 200 కు పైగా టవర్లను ధ్వంసం చేస్తున్నార‌ని పిటిష‌న్ లో తెలిపింది.