నేటి స్టార్ట్‌పలే రేపటి ఎమ్మెన్సీలు

ఇవాళ్టి స్టార్టప్‌ కంపెనీలే రేపటి బహుళజాతి సంస్థలని(ఎమ్మెన్సీలు) ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వీటివల్లే ఆత్మనిర్భర్‌ లక్ష్యం చేరడానికి వీలవుతుందన్నారు.  కొన్ని దశాబ్దాల వరకు విదేశీ బహుళజాతి వ్యాపార సంస్థలు భారత్‌లో సంపన్నవంతమయ్యాయని, అయితే ఈ దశాబ్ది మా త్రం భారతీయ ఎమ్మెన్సీలకే చెందుతుందని పేర్కొన్నారు. 

ఒడిశాలోని సంబల్‌పూర్‌ ఐఐఎం శాశ్వత క్యాంప్‌సను మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం శంకుస్థాపన చేశారు. ‘‘స్టార్టప్‌ కంపెనీలు చాలావరకు రెండో తరగతి, మూడో తరగతి నగరాల్లోనే ఏర్పాటవుతున్నాయి. వీటికి వృత్తిపరమైన మేనేజర్లు అవసరం. భవిష్యత్తులో  ఏర్పడే  భారీ అవకాశాలను యువత అందిపుచ్చుకోవడానికి సిద్ధం గా ఉండాలి’’ అని ప్రధాని ఐఐఎం విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ మిషన్‌కు ముఖ్యమైనవిగా భావించే ఆవిష్కరణలు, సమగ్రతలు మేనేజ్‌మెంట్‌ రంగం లో కీలకమైన  పాత్రపోషిస్తాయని అన్నారు.

మేనేజ్‌మెంట్‌ విద్యలో ఐఐఎం సంబల్‌పూర్‌ క్యాంపస్‌ ఒడిశాకు ప్రపంచంలోనే గుర్తింపును తీసుకురాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. పర్యాటకంగా సంబల్‌పూర్‌ను మరింతమందిని ఆకట్టుకునేలా, అక్కడి చేనేత ఉత్పత్తులు, గిరిజన కళలు, కళాకృతులకు గుర్తింపు తీసుకువచ్చేలా  కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.

దేశంలో 2014లో 13 ఐఐఎంలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 20కి చేరుకుందని మోదీ గుర్తుచేశారు. ఈ  వర్చువల్‌ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్‌ గణేశి లాల్‌, సీఎం నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రులు రమేశ్‌ పోఖ్రియాల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రతాప్‌ సింగ్‌ సారంగి పాల్గొన్నారు.